నిబంధనల మేరకే ఐఆర్బీకి ఓఆర్‌ఆర్‌ లీజు

– ఆ గ్రామాలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌, బీజేపీలకుందా?
– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డి.సుధీర్‌ రెడ్డి, కె.పి.వివేకానంద
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిబంధనల మేరకే ఐఆర్బీ సంస్థ ఓఆర్‌ఆర్‌ లీజుకిచ్చినట్టు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డి.సుధీర్‌ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెండర్ల తర్వాతే లెటర్‌ ఆప్‌ ఆక్సప్టెన్స్‌ ఇచ్చారనీ, పది శాతం డబ్బు ముందే చెల్లించాలన్న నిబంధనేది లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి శుద్ధ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఒఆర్‌ఆర్‌ పై ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మాట్లాడుతూ కేటీఆర్‌ విదేశీ పర్యటనలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడుల రాక, అనేక మందికి ఉపాధి దక్కడం రేవంత్‌ కు మింగుడుపడటం లేదని విమర్శించారు. జీవో 111 పై రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఆ జీవో రద్దు చేయాలని తీర్మానించిన 84 గ్రామాలకు వెళ్లే ధైర్యముందా? అని ప్రశ్నించారు.