మన ప్రత్యర్థి ఆసీస్‌

Our opponent is the Aussies– సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి
– మిల్లర్‌ శతక పోరాటం వృథా
– 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపు
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
నవంబర్‌ 19, అహ్మదాబాద్‌ మొతెరా స్టేడియంలో 2003 ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్‌ పునరావృతం!. కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉద్విగ విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో 2003 ప్రపంచకప్‌ టైటిల్‌ పోరు రీ మ్యాచ్‌కు 2023 వరల్డ్‌కప్‌ ఫైనల్లో రంగం సిద్ధమైంది. డెవిడ్‌ మిల్లర్‌ (101) శతక పోరాటంతో తొలుత దక్షిణాఫ్రికా 212 పరుగులు చేసింది. సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 47.2 ఓవర్లలో ఛేదించింది.
నవతెలంగాణ-కోల్‌కత
ఆస్ట్రేలియా వచ్చేసింది. ప్రపంచకప్‌ టైటిల్‌ పోరులో ఆతిథ్య జట్టుకు సవాల్‌ విసిరేందుకు ఐదుసార్లు చాంపియన్‌ రంగం సిద్ధం చేసుకుంది. కోల్‌కత ఈడెన్‌గార్డెన్స్‌లో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. సఫారీలపై విజయంతో ఫైనల్లోకి చేరుకున్న ఆస్ట్రేలియా.. ఆదివారం అహ్మదాబాద్‌లో టైటిల్‌ పోరులో ప్రియ ప్రత్యర్థి టీమ్‌ ఇండియాతో తలపడనుంది. 213 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కాస్త కష్టపడుతూనే ఛేదించింది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (62, 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరువగా..వార్నర్‌ (29), స్మిత్‌ (30), ఇంగ్లిశ్‌ (28), కమిన్స్‌ (17 నాటౌట్‌) సమిష్టిగా చెమటోడ్చారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా డెవిడ్‌ మిల్లర్‌ (101, 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) బాధ్యతాయుత సెంచరీతో 212 పరుగులు చేసింది.
ఉత్కంఠ ఛేదనలో.. : ఛేదనలో ఆసీస్‌కు ధనాధన్‌ ఆరంభం దక్కింది. ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (62), డెవిడ్‌ వార్నర్‌ (29) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. మిచెల్‌ మార్ష్‌ (0) నిరాశపరిచినా.. స్మిత్‌ (30), లబుషేన్‌ (18) నిలబడే ప్రయత్నం చేశారు. స్పిన్‌కు సహకరించిన పిచ్‌పై మాక్స్‌వెల్‌ (1) నిష్క్రమణతో ఆసీస్‌ శిబిరంలో కంగారు మొదలైంది. 137 పరుగులే ఐదు వికెట్లు చేజార్చుకున్న ఆసీస్‌ను టెయిలెండర్లు ఆదుకున్నారు. జోశ్‌ ఇంగ్లిశ్‌ (28, 49 బంతుల్లో 3 ఫోర్లు), మిచెల్‌ స్టార్క్‌ (16, 38 బంతుల్లో 2 ఫోర్లు), పాట్‌ కమిన్స్‌ (14 నాటౌట్‌, 29 బంతుల్లో 2 ఫోర్లు) చివర్లో ఒత్తిడికి ఎదురొడ్డి మరో 16 బంతులు ఉండగానే విజయాన్ని అందించారు.
మిల్లర్‌ ఒక్కడే : వర్షం ప్రభావిత మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వర్షం అనుకూలత సొమ్ముచేసుకున్న ఆసీస్‌ పేసర్లు సఫారీ టాప్‌-4ను లేపేశారు. డికాక్‌ (3), బవుమా (0), వాండర్‌ డసెన్‌ (6), మార్క్‌రామ్‌ (10)లు 24 పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ సమయంలో డెవిడ్‌ మిల్లర్‌ (101), హెన్రిచ్‌ క్లాసెన్‌ (47) సఫారీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించిన ఈ మిల్లర్‌, క్లాసెన్‌.. దక్షిణాఫ్రికా శిబిరంలో ఆశలు రేపారు. క్లాసెన్‌ నిష్క్రమణతో ఓ ఎండ్‌లో మిల్లర్‌కు సహకారం కరువైంది. మార్కో జాన్సెన్‌ (0), కేశవ్‌ మహరాజ్‌ (4) నిరాశపరిచారు. జెరాల్డ్‌ కోయేట్జి (19, 39 బంతుల్లో 2 ఫోర్లు), కగిసో రబాడ (10, 12 బంతుల్లో 1 సిక్స్‌) టెయిలెండర్లలో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఆసీస్‌ పేసర్లు, స్పిన్నర్లు విజృంభిస్తున్న వేళ ఒంటరి పోరాటం చేసిన డెవిడ్‌ మిల్లర్‌ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఐదు సిక్సర్లు, 8 ఫోర్లతో 115 బంతుల్లోనే శతకం సాధించి ఐసీసీ ప్రపంచకప్‌ నాకౌట్‌లో సెంచరీ బాదిన తొలి దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 49.4 ఓవర్లలో ఆలౌటైన దక్షిణాఫ్రికా 212 పరుగులు చేసింది.
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : 212/10 (డెవిడ్‌ మిల్లర్‌ 101, క్లాసెన్‌ 47, మిచెల్‌ స్టార్క్‌ 3/34, కమిన్స్‌ 3/51)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : 215/7 (ట్రావిశ్‌ హెడ్‌ 62, స్మిత్‌ 30, ఇంగ్లిశ్‌ 28, జెరాల్డ్‌ 2/47, షంషి 2/42)