మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌..

– కాంగ్రెస్‌,బీజేపీ కేవలం నినాదాల పార్టీలు..
– బీఆర్‌ఎస్‌ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ : మంత్రి హరీశ్‌రావు
– నిమ్స్‌ ఆస్పత్రిలో ఆయుష్‌ ఇంటిగ్రేటెడ్‌ వెల్నెస్‌ సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
ఆయుష్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్‌ శాంతి కుమారికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ తరహా వెల్నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హౌమియోపతి, సిద్ధ, ప్రకృతివైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిపుణులైన ఆయుష్‌ వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద, ప్రకృతి వైద్య ప్రక్రియలు, చికిత్సలను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలనూ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వం అలోపతితో పాటు ఆయుష్‌ వైద్యంను ఎంతో ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఇటీవల రూ.10 కోట్లతో నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 834 ఆయుష్‌ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్‌ హాస్పిటల్స్‌ ఉన్నాయని, వికారాబాద్‌, భూపాలపల్లి, సిద్దిపేటలో 50 పడకల కొత్త ఆయుష్‌ ఆస్పత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. సెప్టెంబర్‌ రెండో వారంలో మరో 9 మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరిందని, ఒకే రోజు ఒకే వేదిక నుంచి సీఎం ప్రారంభిస్తారన్నారు. దాంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల సంఖ్య 5 నుంచి 26కు చేరుతుందని, కొత్తగా 900 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2014లో 850 ఎంబీబీఎస్‌ సీట్ల నుంచి ఇప్పుడు 3915 సీట్లను పెంచుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్‌ సృష్టించబోతున్నదని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలు కేవలం నినాదాల పార్టీలని.. బీఆర్‌ఎస్‌ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని తెలిపారు. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్టీలు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. అమిత్‌ షా, ఖర్గే పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివి వెళ్లిపోయారని తెలిపారు. అమిత్‌ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో కరెంటు కష్టాల గురించి ప్రతి రోజూ పేపర్‌లో వార్తలొస్తున్నాయన్నారు. గుజరాత్‌లో బీజేపీ పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్‌ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఆరోపించారు. కర్నాటకలో మూడు నెలలకే కాంగ్రెస్‌ తీరేమిటో తేలిపోయిందన్నారు. ముందు ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. తెలంగాణలో కేసీఆర్‌ను విమర్శించాలంటే తమ తమ రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేసి ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలు మీ డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎప్పుడో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ చేసుకున్నారని చెప్పారు. మాది స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌.. అని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, వెల్నెస్‌ సెంటర్‌ వైద్యులు లక్ష్మి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.