ఓవైసీ చేతిలో కారు స్టీరింగ్‌

Owaisi is steering the car It is BJP that will face BRS and Majlis.– బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ను ఎదుర్కొనేది బీజేపీయే..
– మోసకారి కేసీఆర్‌

– ధాన్యం కొనుగోళ్ల పేరుతో రాజకీయం
– తెలంగాణ ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు
– కేసీఆర్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలి.. : ఖమ్మం ‘రైతు గోస- బీజేపీ భరోసా’ సభలో కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా
నవతెలంగాణ-ఖమ్మం
ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం:
రైతులను బీఆర్‌ఎస్‌ మోసం చేస్తుందని.. వారినే కాక, బీసీ, దళిత, మహిళా, యువత వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్‌ ప్రభుత్వమేనని, దీన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారన్నారు. కారు స్టీరింగ్‌ ఓవైసీ చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, కనీస మద్దతు ధరను 66శాతం పెంచిందని తెలిపారు. ఖమ్మం పట్టణంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘రైతు గోస- బీజేపీ భరోసా’ సభలో అమిత్‌షా మాట్లాడారు. యూపీఏ హయాంలో రైతులకు రూ.22 వేల కోట్ల బడ్జెట్‌ ఉంటే.. మోడీ ప్రభుత్వం దాన్ని రూ.1.25 లక్షల కోట్లకు పెంచిందన్నారు. ప్రధానమంత్రి సమ్మాన్‌ నిధి కింద దేశవ్యాప్తంగా 11కోట్ల మంది రైతులకు పంట పెట్టుబడి సహాయంగా రూ.2.60 లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని, కానీ బీజేపీ ప్రభుత్వం కేవలం ఈ తొమ్మిదేండ్లలో ఒక్క తెలంగాణకే రూ.2.80 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో 1.90 కోట్ల మందికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా కేంద్రం పంపిణీ చేస్తున్నదని, 11 లక్షల మందికి ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మిస్తే తెలంగాణలోనే 2.50 కోట్ల మందికి గృహాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్‌ నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, రాహుల్‌ నాలుగు తరాల 4జీ పార్టీ, బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌, కేటీఆర్‌ రెండు జనరేషన్లు 2జీ పార్టీ, ఎంఐఎం 3జీ పార్టీ అంటూ…తెలంగాణలో వచ్చేది బీజేపీనే అని తెలిపారు. ప్రజలను మోసగించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్యంగా కలుస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షులు ఖర్గే చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ భుజస్కంధాల మీదున్న ఓవైసీ మజ్లీస్‌ పార్టీలను ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ కలిసేదే లేదన్నారు. ఏమైనా సరే రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, మజ్లిస్‌ను ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్‌ కాదు బీజేపీ మాత్రమే అన్నారు. శ్రీరామ నవమికి పట్టువస్త్రాలను తెచ్చే ఆనవాయితీని విస్మరించి భద్రాచలం భక్తుల మనోభావాలను కేసీఆర్‌ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మరోమారు సీఎం కావాలని, లేదంటే కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే కేసీఆర్‌ కలలు నెరవేరవని స్పష్టంచేశారు.
కేసీఆర్‌ పాలనలో వ్యవసాయ విధ్వంసం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి
కేసీఆర్‌ పాలనలో వ్యవసాయ విధ్వంసం కొనసాగుతోందని, వ్యవసాయాన్ని దండుగలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వట్లేదని, పంటల బీమా పథకం అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయ రుణాలపై కేసీఆర్‌ ప్రభుత్వం పావలా వడ్డీని అమలు చేయకుండా, ఒక్క రైతుబంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో 75శాతం ఉన్న కౌలు రైతులకు ఎలాంటి మేలు జరగటం లేదన్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం కల్తీ విత్తన భాండాగారంగా మారిందన్నారు.
ఉచిత ఎరువుల మాటేమిటని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీని ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా మాఫీ చేస్తున్నారన్నారు. రుణమాఫీ సకాలంలో చేయకపోవడంతో వడ్డీలు పేరుకుపోయాయని, మాఫీ చేసిన డబ్బులు వడ్డీలకే పోయాయన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం ఒక్క రైతుబంధు మాత్రమే ఇస్తూ విత్తన, ఎరువులు, వ్యవసాయ పరికరాల వంటి సబ్సిడీలన్నీ ఎత్తివేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వారాల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుందని, చివరికి ట్రాక్టర్‌కు రూ.5వేల చొప్పున లంచం ఇచ్చి అమ్ముకోవాల్సి వస్తుందని, అది కూడా క్వింటాల్‌కు పది కిలోల కోత విధిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే రైతులు, పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజరు మాట్లాడుతూ.. మోసాలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. రాత్రయితే పెగ్గులు.. ఎన్నికలొస్తే హామీలు కేసీఆర్‌కు గుర్తుకు వస్తాయన్నారు. ఇలాంటి కేసీఆర్‌ను ఎలా భరిస్తున్నారని.. ఇతర రాష్ట్రాలకు పోతే కేసీఆర్‌ వల్ల మన ఇజ్జత్‌ పోతుందన్నారు. సభలో జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, సునిల్‌బన్సల్‌, తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌, కేంద్ర సహాయ మంత్రి అరవింద్‌మీనన్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ప్రేమేందర్‌రెడ్డి, శృతి, జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గెల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.