వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ

Package to Vizag Steelplant– రూ.11,440 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం : కేంద్రమంత్రి ప్రకటన
– ఇది శాశ్వత పరిష్కారం కాదు : కార్మిక సంఘాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేందుకు కానీ, సెయిల్‌లో విలీనం చేసేందుకు కానీ కేంద్రం మొగ్గు చూపలేదు. కేవలం ప్యాకేజీ పేరుతో మాత్రమే రూ.11,440 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే, రూ.11,440 కోట్ల ప్యాకేజీలోరూ. 10,300 కోట్లు పెట్టుబడిలో భాగంగా పెడతారు. మిగిలిన రూ. 1,140 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌లో ప్రాధాన్యత వాటా మూలధనంగా మార్చారు. ఈ ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదనీ, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడమంటే సొంత గనులు కేటాయించడమో లేక సెయిల్‌లో విలీనమో చేయాలని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తోన్నాయి. సొంత గనులు కేటాయించటమో, సెయిల్‌లో విలీనం చేయటమో చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే, కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం కేవలం ప్యాకేజీ పేరుతో హడావుడి చేస్తోంది.
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పునరుద్ధరణ ప్యాకేజీ రూ.11,440 కోట్లకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి మాట్లాడారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ 2014 వరకు లాభాల్లో నడిచిందని తెలిపారు. ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అప్పు రూ.35 వేల కోట్లు ఉన్నదనీ, బ్యాంకు రుణాలు, వడ్డీ, సరకు సరఫరాకు చెల్లింపులు చేయాల్సి ఉన్నదని తెలిపారు. తొలుత బ్యాంకర్లతో సమీక్షిం చామనీ, ప్లాంట్‌కు సహాయ సహకారాలు అందించాలని కోరామన్నారు. అందుకు బ్యాంకులు అంగీకరించలేదని వివరించారు. దీంతో, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ), కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాననీ, పీఎంఓతో చర్చల తర్వాత సత్ఫలితాలు రావడం మొదలైందన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సహాయ సహకారాలు అందించాలని ప్రధాని నిర్ణయించారని తెలిపారు. పీఎంఓతో చర్చల తరువాత సెప్టెంబర్‌లో రూ.500 కోట్లు విడుదల చేశామనీ, 2024 అక్టోబర్‌ 9న ఆర్థిక సాయాని కి కేంద్ర ఆర్థికమంత్రి అంగీకరించారని తెలిపారు. ఆర్థిక మంత్రి సూచనలతో ఎస్బీఐ నేతృత్వంలో కమిటీ వేశామనీ, కమిటీ నివేదికపై జీఓఎం చర్చల తర్వాత రూ.11,440 కోట్ల ప్యాకేజీకి నిర్ణయం జరిగిందన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పునరుద్ధరణను మంత్రివర్గం సవాల్‌గా తీసుకుందనీ, మూడు ఫర్నేస్‌లతో 92.3 శాతం ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యమని చెప్పారు. రెండేండ్లలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలుస్తుందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను అప్పుల్లో నుంచి బయటకు తేవడమే ప్రథమ కర్తవ్యమనీ, పూర్తిస్థాయిలో ప్లాంట్‌ పునరుద్ధరణ తర్వాత సెయిల్‌లో విలీనంపై ఆలోచిస్తామన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఎన్నో ఏండ్లుగా నెలకొన్న స్టీల్‌ప్లాంట్‌ సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని తెలిపారు. ‘విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు’ నినాదాన్ని కేంద్రం కాపాడిందన్నారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ.. కార్మికుల భద్రతే ధ్యేయంగా కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్లాంట్‌ను మరింత సమర్థంగా నడిపించాలని నిర్ణయించిందన్నా రు. ఇదే విషయాన్ని కేంద్ర రైల్వే, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా మీడియాకు వెల్లడించారు.
ఇది శాశ్వత పరిష్కారం కాదు : కార్మిక సంఘాలు
స్టీల్‌ప్లాంట్‌ పునరుద్ధరణకు ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదని కార్మిక సంఘాలు తెలిపాయి. ప్యాకేజీతో ప్లాంట్‌ పునరుద్ధరణ సాధ్యం కాదని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సి.హెచ్‌ నర్సింగరావు అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను పునరుద్ధరించాలనే చిత్తశుద్ధి ఉంటే, సొంత గనులు కేటాయించాలని సూచించారు. లేకపోతే సెయిల్‌లో విలీనమైనా చేయాలని అన్నారు. కానీ, కేంద్రం ఆ రకంగా ఆలోచన చేయలేదని విమర్శించారు. కార్మికుల పోరాటం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సొంత గనులు, సెయిల్‌లో విలీనం వంటి శాశ్వత పరిష్కారాల కోసం జరుగుతోందని, అంతేతప్పా.. ప్యాకేజీ కోసం కాదని స్పష్టం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్యాకేజీలు ప్రకటించి, ఆ తర్వాత మూసివేసిన ఉదాహరణలున్నాయన్నారు. రాయబరేలీలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి కూడా ప్యాకేజీ ప్రకటించినట్టే ప్రకటించి, ఆ తర్వాత ప్రయివేట్‌ పరం చేశారని గుర్తు చేశారు. కేంద్రానికి ఇలాంటి కుయుక్తులు సరికాదని అన్నారు. రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఉందనీ, కనుక వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేలా చేయాల్సిన బాధ్యత ఆ రెండు పార్టీలపైనే ఉందని ఆయన సూచించారు.