పజ్రాయుద్ధ పతాక

Pajrayuddha flagఉదయాల్ని చూడలేని హదయాలనూ, చీకట్లను దాటలేని పయనాలనూ మేలుకొలిపి.. నిస్తేజాన్ని సహించని కమ్యూనిస్టుగా ఎరుపెక్కినవాడు కామ్రేడ్‌ బద్దం ఎల్లారెడ్డి.. పుట్టింది నాటి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల తాలూకా గాలిపెల్లి గ్రామం. తల్లి లక్ష్మమ్మ. పోలీస్‌ పటేలైన తండ్రి హనుమంతరెడ్డి.. కొడుకును పెద్ద ఉద్యోగస్తుడిని చేయాలనుకున్నాడు. అది నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలనలో ప్రజలకు కనీస హక్కులు లేని కాలం. మాతభాషకు తావులేదు. దొరలు, దేశ్‌ముఖ్‌ల దోపిడీలో ప్రజలు నలిగిపోతుంటే.. ఆ పీడనకు కనీస ప్రతిఘటనలేని రోజులవి. దేశమంతా స్వాతంత్య్రోద్యమంలో పోరాడుతుంటే.. తెలంగాణ మాత్రం ఈ చీకట్లోనే పారాడుతున్నది..! ఈ పరిస్థితులు ఎల్లారెడ్డిని చదువుకంటే చుట్టూ సామాజిక, రాజకీయ ఆవరణంలో నెలకొన్న పీడనలనెదిరించేందుకే ప్రేరేపించాయి. సరిగ్గా ఆ సమయంలోనే జాతీయ కాంగ్రెస్‌ శాసనోల్లంఘనకు పిలుపునిచ్చింది. దేశమంతటా సత్యాగ్రహులందరూ శాసనధిక్కారానికి సముద్ర తీరాలకు తరలుతున్నారు. వారిలో ఎల్లారెడ్డి ఒకరు. జైళ్లన్నీ సత్యాగ్రహులతో నిండిపోవడంతో కాకినాడ తీరంలో అరెస్టు చేసిన ఎల్లారెడ్డిని పోలీసులు తమిళనాడులోని తిరుచునాపల్లి వదిలిపెట్టారు. దీంతో ఆయన మరో ఐదుగురితో కలిసి సత్యాగ్రహ ఉద్దేశ్యాలను వివరిస్తూ తిరుచునాపల్లి నుండి భీమవరం దాకా ప్రచారయాత్ర సాగించాడు. దీంతో మరోసారి అరెస్తై ఆయనకు ఏడు నెలల కారాగార శిక్షవిధించింది.
కానీ.. ఆ శిక్షా కాలమంతా ఆయనకు ఓ శిక్షణా కాలంగా మారింది. రాజమండ్రి, తిరుచునాపల్లి, బళ్లారి జైళ్లలో అనేకమంది విప్లవకారుల సహచర్యం అతనికి దేశ రాజకీయాల పట్ల ఓ అవగాహన కలిగించింది. కమ్యూనిజాన్ని పరిచయం చేసింది. ఆ వెలుగులో సరికొత్త ఉత్సాహంతో జైలునుంచి విడుదలయ్యేనాటికి దండకారణ్యంలో కొమరంభీమ్‌ నడుపుతున్న గోండు ఉద్యమం అతడిని ఆకర్షించింది. భీమ్‌ కోసం పోలీసులు వెతుకుతున్న సమయంలో ఎల్లారెడ్డి ఆసిఫాబాద్‌ అడవులకు బయలుదేరాడు.. ఆదివాసీ పల్లెలన్నీ తిరిగాడు. ”జల్‌ జమీన్‌ జంగ్లాత్‌” అన్న నినాదం గురించీ, వారి న్యాయమైన పోరాటం గురించి సవివరమైన కథనాలు రాశాడు. గోలకొండ పత్రికలో అచ్చయిన ఆ కథనాలు కల్లోలం రేపాయి. సహించలేని నిజాం రాజ్యం ప్రజలను రెచ్చగొడుతున్నాడని అతనిపై నిఘా పెట్టింది. కానీ సంకెళ్లను ఛేదించడానికి చెరసాలలను సైతం లెక్కచేయని ఆ ఉక్కు సంకల్పాన్ని నిఘాలూ, నిర్బంధాలూ ఏంచేయగలవు..? భీమ్‌ పోరాట స్ఫూర్తినందుకున్న ఎల్లారెడ్డి స్టేట్‌ కాంగ్రెస్‌లో పనిచేస్తూనే ఆంధ్రమహాసభలో చేరి తన కమ్యూనిస్టు అవగాహనకు పదును పెట్టుకున్నాడు.
ఆ వెలుగులోనే తెలంగాణ విముక్తి మార్గాన్ని అన్వేషించసాగాడు. కానీ అతనిపై నిఘా వేసిన ప్రభుత్వం అతడి కదలికలపై తక్షణమే నివేదికకు పోలీసులను ఆదేశించింది. అతడిపై రాజద్రోహం నేరం మోపి అరెస్టు చేసింది ప్రభుత్వం. పోలీసుస్టేషన్‌లో బంధించి చిత్రహింసలు పెట్టింది. కాళ్లకు చేతులకు సంకెళ్లువేసి నడిరోడ్డుమీద ఆ కమ్యూనిస్టు యోధున్ని కోర్టుకు నడిపించుకుపోతుంటే.. దారికిరువైపులా బారులుతీరిన వేలాది జనం ఆ జననేతకు జేజేలు పలికారు. ప్రజల నిరసనల మధ్య కోర్టు అతడికి ఏడాది కఠిన కారాగార శిక్ష విధించగా వరంగల్‌ జైలుకు తరలించారు. జైలు నిర్బంధంలో అతడి ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా లెక్క చేయక తోటి ఖైదీలకు రాజకీయాలు బోధించి చైతన్యపరిచాడు. వారి కనీస హక్కుల కోసం పోరాడాడు. తనను రాజకీయ ఖైదీగా గుర్తించాలనీ, చదువుకోవడానికి పుస్తకాలూ, పత్రికలూ ఇవ్వాలనీ నిరాహారదీక్ష చేపట్టడంతో ఆరోగ్యం మరింత చెడింది. ఈ వార్త గోలకొండ పత్రికలో ప్రచురితం కావడంతో.. అప్పటికే అతడి అరెస్టు పట్ల ఆగ్రహంతో ఉన్న ప్రజల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి.. చివరికి దిగొచ్చిన ప్రభుత్వం శిక్ష రద్దుచేసి గహనిర్బంధానికి ఆదేశించింది. ఈ సమయంలోనే చిలుకూరులో 8వ ఆంధ్రమహాసభ జరిగింది. ఖమ్మంలో జరిగిన మూడవ ఆంధ్రమహాసభకు స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికై, నాలుగో ఆంధ్రమహాసభ తన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో నిర్వహించి, తదుపరి 5,6,7 మహాసభల్లో కీలకంగా వ్యవహరించిన బద్దం ఎల్లారెడ్డి.. మహాసభను రాజకీయ వేదికగా మల్చడంలో గొప్ప పాత్ర నిర్వహించాడు. గహనిర్బంధం వల్ల 8వ మహాసభలో పాల్గొనలేకపోయిన… తన సహచరుడు రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు చాలా సంతోషించాడు.
భాషావికాసమే లక్ష్యంగా ఒక సాంస్కతిక వేదికగా మొదలైన ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల నాయకత్వంలో రాజకీయ వేదికగా పదునెక్కుతోంది. అప్పటికే ఆంధ్రరాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడటం, సుందరయ్య, చండ్రరాజేశ్వర్‌రావులు ఆంధ్రమహాసభ యువ నాయకత్వంతో సంబంధాలు ఏర్పరుచుకోవడమేగాక వారికి రాజకీయ సైద్ధాంతిక తోడ్పాటునివ్వడంతో క్రమంగా మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగింది. కానీ ఆంధ్రమహాసభ రాజకీయాలకు అతీతంగా కేవలం సాంస్కతిక వేదికగానే సాగాలన్నది మితవాదుల వాదన. తెలంగాణలో భాషావికాసమే కాదు, బతుకుల వికాసం కూడా జరగాలనీ, అందుకు రాజకీయ పోరాటమూ అవసరమేనన్నది కమ్యూనిస్టుల వాదన. భువనగిరిలో జరిగిన పదకొండో మహాసభ నాటికి అధ్యక్షులుగా రావి నారాయణరెడ్డి, కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికై పూర్తిగా కమ్యూనిస్టుల ఆధిపత్యంలోకి తీసుకువచ్చారు.
ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రజ ఉవ్వెత్తున లేచింది. భరించలేని భూస్వామ్యం రెచ్చిపోయింది. దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు. తెలంగాణ రణరంగమైంది. ఆ కట్టలు తెగిన ప్రజాగ్రహం సాయుధపోరాట రూపం తీసుకోవడంలో ఎల్లారెడ్డి పాత్ర చిరస్మరణీయమైనది. తెలంగాణ ప్రజా విముక్తికి సాయుధ సమరమొక్కటే మార్గమైనప్పుడు ఆ సమరానికి సారథ్యం వహించిన అగ్రజుల్లో ఎల్లారెడ్డి ఒకరు. సాయుధ పోరాట పర్యవేక్షణలో అతడు తెలంగాణమంతా తిరుగుతుండగా… జనగామ ప్రాంతంలో అతని రహస్య స్థావరంపై దాడిచేసి అరెస్టు చేసి నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి వారాల తరబడి చిత్రహింసలు పెట్టారు. తుదకు ప్రజల ఒత్తిడి మేరకు కోర్టుకు తరలించగా కోర్టు మూడేండ్లు కారాగార శిక్ష విధించింది. 1951 డిసెంబరు 5న ఆయన విడుదలయ్యేనాటికి దేశమంతటా కమ్యూనిస్టులపై నిషేధం తొలగినా తెలంగాణలో మాత్రం తొలగలేదు. 1952 ప్రథమ సార్వత్రిక ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరపున కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ నర్సింహారావుపై అఖండవిజయం సాధించారు. అనంతరం కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, జాతీయ సమితి సభ్యునిగా కొనసాగారు. 1958లో బుగ్గారం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందిన ఎల్లారెడ్డి 64లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 72లో తిరిగి ఇందుర్తి నుండి శాసనసభకు ఎన్నికై పార్లమెంటరీ రంగంలోనూ ప్రజల మనిషిగా తన విశిష్టతను చాటుకున్నాడు. అనారోగ్యంతో 1978 డిసెంబర్‌ 27న తుదిశ్వాస విడిచారు. బద్దం ఎల్లారెడ్ది నిత్యం ప్రజాయుద్ధ పతాకగా రెపరెపలాడుతూనే ఉంటాడు.- రాంపల్లి రమేష్‌, 9490099038