పల్లా ఖబర్దార్‌..

– తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావ్‌..? పల్లాపై ముత్తిరెడ్డి ఆగ్రహం
– జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అర్ధనగంగా నిరసన
నవతెలంగాణ-జనగామ
పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఖబర్దార్‌.. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావ్‌..? ప్రజాకోర్టులో దోషిగా నిలబడటం తప్పదంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫైర్‌ అయ్యారు. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యవహారంపై ముత్తిరెడ్డి అనుచరులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ముత్తిరెడ్డి అనుచరులు చేసిన వ్యాఖ్యలపై పల్లా అనుచరులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది. పల్లాకు వ్యతిరేకంగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అనుచరులు, దళితులు నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి జ్ఞానోదయం కలగాలంటూ.. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వినతిపత్రం అందజేశారు. అనంతరం చౌరస్తా వద్ద ముత్తిరెడ్డి చొక్కా విప్పి అర్ధనగంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో తెలియదని విమర్శించారు. దళిత నాయకుల మీద కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కబర్దార్‌ అని హెచ్చరించారు. బీబీ నగర్‌లో 256 మంది ప్లాట్లను కబ్జా చేసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన కొడుకు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకున్నరని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ పల్లాపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. పల్లా దళితులపై కేసులు పెట్టడంపై పార్టీ పక్షాన వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. డబ్బు సంచులతో ప్రజలను కొనలేరన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆక్రమించుకున్న ప్లాట్లను వారికి అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్‌ చైర్మెన్‌ బి.సిద్ధి లింగం, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పసుల ఏబెల్‌, ఆనందం, తిప్పారపు విజరు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ పాండు తదితరులు పాల్గొన్నారు.