దక్షిణ రాజ్యాలలో క్రీ.శ.6,7 శతాబ్దాలలో పల్లవరాజులది ముఖ్యపాదం అయింది. పల్లవులు అనగానే తమిళనాడులోని మహాబలిపురం గుర్తుకు వస్తుంది. మహాబలిపురం అనగానే చిన్ననాడు 1970లలో రేడియోలో విన్న పాట గుర్తుకు వస్తుంది. ‘బాలరాజు కథ’ అనే సినిమాలో బాలరాజు అనే చిన్నపిల్లవాడు తన కుటుంబ జీవనాధారం కోసం మహాబలిపురంలో వచ్చే సందర్శకులకి పాట పాడుతూ గైడ్‌లా పని చేస్తుంటాడు. ఆ పాటలోనే ”… మహాబలిపురం… భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం, కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు’, కంచి (కంచీపురం) రాజధానిగా పాలించాడు, ఇది మంచి రేవు పట్టణంగా కట్టించాడు, తెలుగు సీమ శిల్పుల్ని రప్పించాడు. పెద్ద శిలలన్నీ శిల్పాలుగా మార్పించాడు” ఇలా… చరిత్ర విషయాలు చెపుతాడు.
పల్లవులు తెలుగు సీమ వారసులే. చరిత్రకారుల ప్రకారం వారి పూర్వ చరిత్ర క్రీ.శ2వ శతాబ్దం వరకూ మూలం కనిపిస్తుంది. కానీ వారి ప్రాముఖ్యత క్రీ.శ. 6వ శతాబ్దంలో కనిపించడమే కాక, వారు తరువాత 200 సంవత్సరాలు పాలించారు. వారి రాజ్య సరిహద్దులు దక్షిణ భారతమే కాదు, ఆగేయ ఆసియా, చీనీ ప్రాంతాల వరకూ పాకింది. కొన్ని సార్లు దక్కనీ భూమికి, ఒరిస్సా వరకూ పాకాయి. పశ్చిమ లేదా బదామి చాళుక్యుల గురించి ఇంతకు ముందు మాట్లాడాం. వారికీ వీరికీ ఎప్పుడూ యుద్ధాలు జరిగేవి. అందులో ఒకరి కళా పద్ధతులు మరొకరు చూడడం వలన వారూ వీరూ కొన్ని కొత్త కళా పద్ధతులూ నేర్చుకున్నారు.
పల్లవుల కళలకు ఒక ప్రత్యేక శైలి వుంది. వీరికళా పద్ధతులలో క్రీ.శ. 2,3 శతాబ్దాలలోని తెలుగునాటి ఇక్ష్వాకుల బౌద్ధ కళల శైలి, శిల్పం చెక్కిన తీరూ కనిపిస్తుంది. కానీ పల్లవులు శైవులు, హిందూ కళలనే ప్రోత్సహించారు. వారి సమాజంలో శైవులైన నయనమార్ల వలన, వైష్ణవులైన ఆళ్వాచార్యుల వలన భక్తి మార్గం ప్రబలింది. కళలూ వృద్ధి చెందాయి. బలవంతులైన పల్లవరాజులు ఆ కళలకు ప్రోత్సాహం ఇచ్చారు. మొదటి నుండీ అక్కడ రాయినే ఉపయోగించడం వలన వీరూ రాతి శిల్పాలను నిర్మించారు.
మొదటి దశలో పల్లవుల కళా నిర్మాణాలు, కొండ తొలిచి గుహలలో నిర్మించిన శిల్పాలే. ఆ తరువాత కాలాల్లోనే రాతితో నిర్మించిన మందిరాలు కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో రెండూ కనిపిస్తాయి. ఒకటవ మహేంద్రవర్మన్ చేత నిర్మించబడినవి పల్లవుల మొదటి దశ నిర్మాణాలు. ఇతను జైనుడు. క్రీ.శ.7 వ శతాబ్దపు మొదటి దశలో పాలించాడు. అప్పార్ అనే శైవ ఆచార్యుడి వలన ప్రభావితుడై శైవుడయ్యాడు. శైవ నిర్మాణాలని కట్టించాడు. అందులోనిదే ఒకటి మండపగట్టు అనే గుహ నిర్మాణం. అతని ఆయుధం పేరు లక్సిత. అదే పేరు మీద ఈ మందిరాన్ని పిలుస్తారు. అక్కడి శిలాశాసనంలో ఈ పేరు, అతని పేరు ‘విచిత్ర చిత్త’ అని రాసి వుంటుంది. ఇంకా ఆ గుహ త్రిమూర్తి గుహ అనీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితమనీ, ఆ కట్టడంలో ఇటుక, కర్ర, లోహం, సున్నం లేకుండా కట్టిన కట్టడమనీ రాసి వుంటుంది (అంటే కొండ తొలిచి నిర్మించిన కట్టడమనే కదా అర్దం). అక్కడ త్రిమూర్తుల శిల్పాలు లేవుకానీ, 3 చిన్న గర్భ గుహలు వున్నాయి. గుహ ముందు ఇద్దరు ద్వార పాలకుల శిల్పాలు తప్ప మరే శిల్పాలు లేవు. అయితే ఈ ఇద్దరు ద్వార పాలకులు ఒకరు ఒక భంగిమ, మరొకరు మరో భంగిమలో నిల్చుని వుంటారు. ఈ శిల్పాలు పొడవుగా, సన్నగా వుండి, తెలుగు నాటి శాతవాహన, ఇక్ష్వాకు ద్వార పాలకుల శిల్పాన్ని గుర్తు తెస్తాయి. అయితే పల్లవుల నిర్మాణాలలోని ద్వార పాలకులు ప్రతి కట్టడంలోనూ ఒక ప్రత్యేకత కలిగి వుంటాయి. వారి ఉబ్బిన కళ్లు, భయం కల్గించే ముఖ రేఖలతో కనిపిస్తాయి.
ఒకటవ మహేంద్రవర్మకి చెందినదే మరోటి, తిరుచురాపల్లిలోని కొండలో కట్టిన కోటలోని గుహ నిర్మాణం. దీన్ని లలితాంకుర గుహ అని పిలుస్తారు. ఇది అతని మరో బిరుదు. ఈ గుహలోని శిల్పం గంగాధర మూర్తి. శివుడు తన కుడికాలుని మరగుజ్జుపై వుంచి, ఎడమకాలుపై భంగిమలో నిల్చుని, నాలుగు చేతులలో, ఎడమవైపు ఒక చేయి తొంటిపై, మరో చేయి ఎత్తిపట్టి, కుడి పక్క చేతులలో విప్పిన తన జడ పాయలు పట్టి, ఉరవడిగా ఆకాశం నుండి వస్తున్న గంగని తన జడలలో బంధించడానికి సిద్ధంగా నిల్చున్న శివరూపం ఇది. 4 పక్కల నాలుగు నాట్య రూపాలు చెక్కిన అందమైన శిల్పం. అక్కడి స్తంభంపై వున్న శిలాశాసనంలో ‘శివుడికి గంగలాగా, మహేంద్రుడికి కావేరి అంత ప్రీతి’ అని ఈ రాజుని శివుడితో పోల్చుతూ రాసి ఉంది.
ఒకటవ నరసింహవర్మన్, ఒకటవ మహేంద్రవర్మ కొడుకు. ఈ నరసింహవర్మన్ ఆయుధం పేరుతోనే ఇతన్ని మామల్ల అని పిలుస్తారు. ఇతను క్రీ.శ.7వ శతాబ్దపు ఆఖరి దశలో పాలించాడు. పల్లవుల ముఖ్య కళా నిర్మాణాలు ఇతని కాలంలోనే జరిగాయి. ఇతను క్రీ.శ.642లో, బదామి లేదా పశ్చిమ చాళుక్యుడు రెండవ పులకేశిని ఓడించి బదామిని చేజిక్కించుకున్నాడు. దక్షిణ భారతంలోని మరికొన్ని రాజ్యాలను చేజిక్కించుకోవడమే కాకుండా, నావికా దళాలను పంపి శ్రీలంకనూ చేరాడు. ఇతను కాంచీపురాన్ని రాజధానిగా పాలించాడు. ఆ సమయంలో చీనీ యాత్రికుడు హుఆన్ త్సుంగ్ కాంచీపురానికి వచ్చాడు. నరసింహవర్మన్ మామల్లపురం అనే పేరు పెట్టి ఇక్కడ పెద్ద సముద్రరేవు పట్టణం కట్టాడు. ఈ రేవు ముందే వుండేది. దీని ద్వారా వ్యాపారం జరగడమే కాదు, కొంతమంది చీనీ బౌద్ధ యాత్రికులూ, భారతీయ బౌద్ధ యాత్రికులూ ఇక్కడి నుండే ప్రయాణం చేశారు.
ఇతని కాలంలోనే ముఖ్యమైన కొన్ని కళామందిరాలు నిర్మించాడు. అంతకుముందు వున్న పల్లవుల కళా పద్ధతులకు మెరుగులు దిద్దబడినాయి. ముందు కాలంలోని గుహ నిర్మాణాలలో కన్పించే స్తంభాలు మందంగా లావుగా వుండేవి. ఇతని సమయంలో గుహ లేదా మందిరాల స్తంభాలు సన్నగా చెక్కి ఆవరణంతా గాలి, వెలుతురు నిండి కనిపిస్తుంది. స్తంభాల మొదట్లో కూర్చున్న సింహాలు ముందరి పల్లవుల గుర్తు అయితే, తరువాత సమయంలో అవి నిల్చున్న సింహాలు, ఆపై ఉత్తేజంగా వున్న సింహాలుగా చెక్కారు. మామల్లపురంలోని వరాహ గుహ ఇతని కాలంలోనిదే అయినా, ఇంకా అందులో స్తంభాలు, కూర్చున్న సింహాలపై బరువు మోపి కనిపిస్తాయి. ఈ గుహలో ఒక ఆకర్షణ… వర్షాకాలంలో నీరు బాగా నిండేటట్టుగా ఒక నీటి తొట్టె చెక్కి వుంది. ఆ నీటిని దాటే సందర్శకులు అక్కడి గుహని చేరాలి. దీర్ఘ చతురస్రాకారపు వసారాలో గుహ గోడలపై శిల్పాలు చెక్కి వుంటాయి.
ఎడమ పక్క గోడపై ఈ వరాహ గుహలో భూమిని మోకాళ్లపై అవలీలగా కూర్చోబెట్టుకున్న వరాహుడు, మరోపక్క వామనావతార విష్ణు, త్రివిక్రముడై మూడు పాదాలు మూడు లోకాలను ఆక్రమించి నిల్చుని కనిపిస్తాడు. ఇందులో మరో అర్ధం గూడా చేర్చి ఈ రూపాలు చెక్కారు. ఈ రాజు వీరుడై పల్లవ భూమిని రక్షిస్తున్నాడనీ, రాజ్యం ఆ రీతిగా, విస్తరింప చేస్తున్నాడనీ. అలాగే కుడిపక్క గోడపై చెక్కిన దుర్గరూపం ధైర్యానికి గుర్తు అయితే, ఎడమపక్క గోడపై ఏనుగులు అభిషేకం చేస్తున్న గజలక్ష్మి శిల్పం ఆ రాజ్యంలోని సిరిసంపదలకు గుర్తు. ఈ శిల్పాలు చెక్కిన తీరు తెలుగునాట ఇక్ష్వాకు రాజుల శిల్పకళా పద్ధతిలో కనిపిస్తాయి. అలాగే ఏ పురాణ కథ చెక్కినా ముఖ్యరూపం మధ్యలో చెక్కి, కథకు సంబంధించిన వేరే రూపాలను చిన్న ఆకారాలతో పక్కగా చెక్కి వుంటాయి. ఏ రూపమైనా లోపలివైపుకి చెక్కబడి, ఇంకా లోపలికి ఆకారం వున్నట్టు భ్రమ కలుగుతుంది. ఇది రోమనుల కళాపద్ధతి. అంటే ఆనాటి సముద్ర వ్యాపారాల వలన ఒకరి కళలు మరొకరు నేర్చుకునే వరకూ వస్తుమార్పిడి జరిగిందన్నమాటేగా. మామల్లపురంలోని ఒక్కోగుహ ఒక్కో ఆశ్చర్యకరమైన శిల్పాలను, నిర్మాణ పద్ధతులను కలిగి వుంది. ఇక్కడా ఒక త్రిమూర్తి గుహ, మధ్యలో శివ, ఎడమ పక్క బ్రహ్మ, కుడి పక్క విష్ణురూపాలకు అంకితం. కుడి పక్కగా వరండాలో 8 చేతుల దుర్గ, మహీషుడిని ఓడించి, అతని తలపై నిలుచుని వుంటుంది. మహిషాసురమర్ధిని రూపాలు, దక్షిణ భారతంలో ఎన్నో వైవిధ్య రూపాలతో చెక్కబడి వుంటాయి. ఒక చోట భీకర యుద్ధం జరుగుతున్నట్టు, మరో చోట అణిచి వేయబోతున్నట్టు, ఇంకో చోట ఓడించినట్టు దేవీ అవతారాలు ఎన్నో, అన్ని రకాల వైవిధ్యాలతో ఒక్క మహిషాసుర మర్దిని దుర్గ రూపాలు కనిపిస్తాయి. ఇక్కడే వున్న మరో గుహ మహిసాసుర మర్దిని గుహ. సింహంపై కూర్చున్న దుర్గ సైన్యంతో ముందుకు సాగుతుంటే, మనిషి ఆకారం, మహిషి శిరస్సు వున్న రాక్షసుడు, పెద్ద ఆకారం వున్నా, దుర్గ ధాటికి వెనక్కి అడుగు వేస్తూ వుంటే, అతని సైన్యం కింద పడిపోయి కనిపిస్తుంది. ఇది యుద్ధం చూపుతున్న శిల్పం.
ఈ మామల్లపురంలో ఒక కొండ తొలిచి గుహలను చెక్కిన వాటి పక్కనే మరో పెద్ద దృశ్యం చెక్కబడింది. 30 మీటర్ల పొడవున్న ఈ కొండ దృశ్యంలో ప్రకృతిని అందంగా చెక్కారు. మధ్యలో నీటి పాయ వదలగా, నిజమైన నీరు పారుతూ, మరింత అందంగా కనిపించే ఈ దృశ్యంలో ఒక బక్కచిక్కిన మనిషి తపస్సు చేస్తూ కనిపిస్తాడు. ఈ శిల్పం అర్జునుడు పాశుపతం కోసం చేస్తున్న తపస్సు దృశ్యం అనీ, భగీరధుడు గంగ కోసం చేస్తున్న తపస్సు అనీ చరిత్రకారుల మధ్య వాదం వుంది. ఏదైనా ఈ శిల్పం మటుకు ప్రకృతి దృశ్యంతో అందమైన ఏనుగు శిల్పంతో పల్లవుల శిల్పానికి ఒక ప్రత్యేకత తెచ్చింది. ఇది ఒకటవ మహేంద్ర వర్మ కాలానిదా లేదా ఒకటవ నరసింహ వర్మ కాలానిదా అనేది కూడా సందేహమే.
పల్లవులు మొదలుపెట్టిన రాతి మందిర నిర్మాణాలు, సముద్రపు ఒడ్డున వున్న ఒంటిరాయితో నిర్మించిన పంచ పాండవుల రథాలు లేదా మందిరాలు ధర్మరాజ మందిరంలో సోమస్కందమూర్తి రూపం చెక్కబడి వుంటే, అర్జునుడి మందిరం పక్కనే ద్రౌపది రథం గుడిసె ఆకారంలో చెక్కి వుంది. ఇందులో లోపల, బయట దుర్గ రూపాలు చెక్కి కనిపిస్తుంది. వీరి కాలంలో దుర్గ రూపాలు ఎన్నో చోట్ల శిల్పాలుగా చెక్కబడి శక్తి రూపానికి నాంది కాలంలా కనిపిస్తుంది. నకుల సహదేవ మందిరం ఒకటే మందిరం. అది తెలుగు నాటి ఇక్ష్వాకు రాజుల చేజెర్ల మందిరంలా కనిపిస్తుంది. రాజధాని కాంచీపురంలో రాజు ‘సింహేశ్వర పల్లవేశ్వర’ అనే కైలాసనాథ్ మందిరం అతి గొప్ప మందిరం. క్రీ.శ. 8వ శతాబ్దపు మొదటి భాగంలో కట్టిన ఈ మందిరం రాజసింహుడు మొదలుపెట్టగా 3వ మహేంద్ర వర్మ పూర్తి చేశాడు. గర్భ గృహం మరో 9 మందిరాలతో చుట్టి వుండగా, ప్రాకార గోడ చుట్టి 58 చిన్న మందిరాలు కనిపిస్తాయి వీటిలో వైష్ణవ, శైవ, శక్తి రూపాల పురాణ కథలు చెక్కబడ్డాయి. ఇవి ఉమా మహేశ్వర మూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ విష్ణు రూపాలు, సంధ్యా తాండవమూర్తి, దుర్గ, భైరవి, కౌషికి, జ్యేష్ఠా, భిక్షాటన మూర్తి, దక్షిణామూర్తి, నరసింహ, త్రివిక్రమ, శ్రీదేవి, భూదేవి, అర్జునుడు, శివుడు చేసిన భీకర యుద్ధం కిరాతార్జనీయం వంటి ఎన్నో అందమైన శిల్పాలు చెక్కినట్లు కనిపిస్తాయి. ఈ మందిరం ఆ శకంలో ఒక మైలురాయి అయి, ఈ శైలి మహారాష్ట్రలోని ఎల్లోరాకూ పాకింది.
– డా||ఎం.బాలామణి, 8106713356