ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఎదుర్కొందాం

ఆధునిక మానవుడు అడుగుపెట్టిన చోటల్లా విధ్వంసమే. అంతు పొంతూ లేకుండా అప్రతిహాతంగా సాగుతున్న దారుణ, మారణ పర్యావరణ విధ్వంసం. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న చందంగా తమ జీవితాలకు, జీవనానికి సమస్తాన్ని సమకూర్చి పెడుతున్న ప్రకృతిని, పర్యావరణాన్ని విషతుల్యం చేయటం ద్వారా మనిషి తన మరణ శాసనం తానే రాసుకుంటున్నాడు. అలాగే భూమ్మీద జీవిస్తున్న సమస్త జీవరాశి నుదిటిన కూడా మరణ శాసనం రాస్తున్నాడు. ఆధునిక మానవుని అనాగరిక చర్యల వల్ల పర్యావరణం తిరిగి కోలుకోలేనంత తీవ్రమైన సంక్షోభాన్ని నేడు ఎదుర్కొంటుంది. అయినా మనిషి తీరు మారటం లేదు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉపరితల జలాలను కమ్మెస్తున్న కలుషితాలు, విశ్వమంతా విస్తరిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలు, గతి తప్పిక కాలచక్రాలు, ధ్వంసమవుతున్న జీవ వైవిధ్యం మొత్తంగా అతిపెద్ద పర్యావరణ సంక్షుభిత కాలంలో మనం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సం జరుపుకుంటున్నాం. 1972లో స్వీడన్‌లో పర్యారణంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు అనంతరం ఐక్యరాజ్యసమితి యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌ఇపి) అనే సంస్ధని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1973 నుండి యుఎన్‌ఇపి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూన్‌ 5వ తేదిన ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాయి. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని ‘ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని ఎదుర్కొందాం (బీట్‌ ది ప్లాస్టిక్‌ పొల్యూషన్‌) అనే నినాదంతో జరుపుకోవాలని యుఎన్‌ఇపి పిలుపునిచ్చింది.
అక్కడ చదవాలంటే ప్లాస్టిక్‌నే ఫీజుగా చెల్లించాలి…
పర్యావరణాన్ని కాలుష్యం బారి నుండి కాపాడి ఒక పరిశుభ్రమైన పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు కానుకగా ఇవ్వాలని కొంత మంది కలగంటూ ఉంటారు. అటువంటి వారిలో అసాంకు చెందిన పర్మితా శర్మ ఒకరు. పర్యావరణానికి ఎనలేని హాని కల్గిస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తొలగించడానికి, ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్ధాలపై చిన్న పిల్లలలో అవగాహాన కల్గించడానికి ఆమె చేపట్టిన ఒక్క విన్నూత్న ప్రయత్నం ఆమెకి దేశవ్యాపిత గుర్తింపుని తీసుకు వచ్చింది. పేద వర్గాలను చెందిన విద్యార్ధులకు విద్యనందించాలన్న లక్ష్యంతో ‘అక్షర ఫోరం’ అనే విద్యా సంస్ధని ఆమె అసాంలోని గౌహాటిలో ఏర్పాటు చేసింది. ఈ స్కూలులో చదువుకునే పిల్లలు వారానికి 25 వాడి పారేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను లేదా వాటికి సమానమైన ప్లాస్టిక్‌ వ్యర్ధాలను ఫీజుగా చెల్లించాలి. స్కూలు పరిసరప్రాంతాలలో గ్రామస్తులు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను పోగు చేసి చలి కాచుకోడానికి ఈ వ్యర్ధాలను మంటలుగా వేసుకోవటం గమనించిన పర్మితా శర్మ ప్లాస్టిక్‌ వ్యర్ధాలను బహిరంగంగా తగుల బెట్టటం వల్ల ఉత్పన్నమయ్యే విషవాయువుల నుండి అక్కడి ప్రజలను కాపాడాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిట్కా పనిచేసి గ్రామస్తులు ఎవరూ ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తగులబెట్టటం మానుకుని, వాటిని సేకరించి తమ పిల్లల ఫీజులుగా చెల్లిస్తున్నారు. ఈ విన్నూత్న కార్యక్రమం ఆమెకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. ఆ ప్రాంతాన్ని కాలుష్యం నుండి కాపాడింది. ఆమె అందించిన సేవలకు, విన్నూత్నంగా ఆలోచించే ప్రతిభావంతులైన మహిళలకు అందించే దేవి అవార్డును అందుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవ 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 21వ శతాబ్దంలో మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకు ప్రధానమైన అడ్డంకులలో ఒకటిగా భావిస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటి పైకి రావాలని పిలుపునిచ్చింది. 2023 పర్యావరణ దినోత్సవాన్ని ఈ ఏడాది యుఎన్‌ఇపి తరుపున నెదర్లాండ్స్‌ భాగస్వామ్యంతో కోట్‌ డి ఐవోర్‌ నాయకత్వం వహిస్తుంది. కోట్‌ డి ఐవోర్‌ 2014 నుండి ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని నిషేదించింది. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించటంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో చురుకైన పాత్రను పోషిస్తుంది.
విశ్వమంతా విస్తరించిన ప్లాస్టిక్‌ భూతం…
మానవుడు జీవించలేని దుర్భేధ్యమైన ప్రాంతాల్లో కూడా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు చేరుకున్నాయి. పునర్వినియోగం చేయలేని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పెద్దయెత్తున్న వినియోగించటం వల్ల తలెత్తే ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో విశ్వమంతా నిండి పోతుంది. అభివృద్ధిని చెందిన దేశాల కన్నా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికన్‌ దేశాలలోనే ప్లాస్ట్ణిక్‌ కాలుష్యం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 400 మిలియన్‌ టన్నుల కన్నా ఎక్కువగా ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంటే దానిలో సగం అంటే సుమారు 200 మిలియన్‌ టన్నుల ఒకసారి వాడి పారేసే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కావటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 19 నుండి 23 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలు జలాశయాల్లోకి నేరుగా విడుదల చేస్తున్నారు. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరం నుండి అతి లోతైన మెరియానా ట్రెంచ్‌ వరకూ ప్లాస్టిక్‌ వ్యర్ధాలు చేరుకున్నాయంటే ప్లాస్టిక్‌ ఎంతటి వేగంగా జీవావరణ వ్యవస్ధలను కబళిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్లాస్టిక్‌ వ్యర్ధాలు విశ్వమంతా విస్తరించాయి. జీవ రహితమైన ప్రాంతాలలో కూడా ప్లాస్టిక్‌ వ్యర్ధాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2021లో దాదాపుగా 390.7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి కాగా, 14 మిలియన్‌ టన్నులకుపైగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు సముద్రాల్లోకి ప్రవేశించాయని యున్‌ఇపి అంచనా వేసింది. 2040 నాటికి 23 నుండి 37 మిలియన్‌ టన్నుల వ్యర్ధాలు మహాసముద్రాలను ముంచెత్తుతాయని, 2060 నాటికి ఇది 155 నుండి 265 టన్నులకు చేరుకునే అవకాశముందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఆరోగ్యానికి ప్రమాదం
అనేక దేశాల్లో గాలిలో మైక్రో ప్లాస్టిక్‌ కణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకూ భూమి పొరల్లో నిక్షిప్తమయై భూకాలుష్యానికి, జల వనరుల్లో చేరి జలకాలుష్యానికి ప్లాస్టిక్‌ వ్యర్ధాలు కారణమవుతాయని భావించే వారు. కానీ బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను డంప్‌ చేయటం, వాటిని బహిరంగంగా కాల్చటం వల్ల అనేక విష వాయువులు వాతావరణంలోకి విడుదలై అక్కడ ఉండే జీవరాశికి, మానవాళికి ప్రాణాంతక వ్యాధులను కలుగుచేస్తున్నాయి. ఏండ్ల తరబడి భూమి మీద ప్లాస్టిక్‌ క్షయానికి గురై చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్‌ కణాలుగా విడిపోతాయి. సూక్ష్మ పరిమాణంలో ఉండే ఈ మైక్రో ప్లాస్టిక్‌ కణాలు గాలి ద్వారా జీవుల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తులోకి చేరి మరణాలకు కారణమవుతుందని ఇటీవల జరిగిన అనేక పరిశోధనలో తెలింది. మానవుని శరీరంలోని కాలేయం, ప్లీహాం, ఊపిరితిత్తులు వంటి శరీర భాగాల్లో శాస్త్రవేత్తలు మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలను కనుగొన్నారు. చివరికి తల్లి పాలల్లో కూడా మైక్రో ప్లాస్టిక్‌ కణాలను కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్‌ ఎంతటి ప్రమాదకారో మనం అర్ధం చేసుకోవచ్చు.
జీవ వైవిధ్యానికీ పెను ముప్పే…
ప్రపంచవ్యాప్తంగా భూమి మీద నివశించే జీవుల కన్నా సముద్రంలో జీవించే జీవులు ఎక్కువగా నష్టపోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్ధాల వల్ల పక్షులు, చేపలు, ఇతర సముద్రజీవుల వరకు ప్రతి ఏడాది మిలియన్ల కొద్దీ మరణిస్తున్నాయి. వీటి మృతదేహాలను పరిశీలిస్తే వాటి శరీర భాగాల్లో ప్లాస్టిక్‌ వ్యర్ధాలను కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 800కి పైగా జీవజాతులు ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నాయని ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ (ఐయుసిఎన్‌) సంస్ధ లెక్కగట్టింది. ఉపరితల జీవులతో పాటు, లోతైన ప్రదేశాలలో నివశించే 80 శాతం సముద్ర జీవుల శరీరాల్లో కూడా ప్లాస్టిక్‌ ఉండే అవకాశముందని ఆ సంస్ధ తెలిపింది. ఇటీవల ఆ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రపంచ మహా సముద్రాలలో 170 ట్రిలియన్లకు పైగా ప్లాస్టిక్‌ కణాలు సముద్ర జలాల్లో తేలియాడుతున్నాయని వెల్లడించింది. 100కి జీవజాతులకు చెందిన జీవుల్లో మైక్రో ప్లాస్టిక్‌ కణాలు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2050 నాటికి సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్ధాల బరువు వాటిలో ఉండే జలచరాల బరువు కన్నా అధికంగా ఉండే అవకాశముందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.
భూతాపాన్ని మరింత పెంచుతున్నాయి
ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల 50 వేల కృత్రిమ రసాయనాలు విడుదలవుతుంటే వాటిలో 10 వేలకుపైగా రసాయనాలు ప్లాస్టిక్‌ కలుషిత ఉద్గారాలేనని పరిశోధకులు నిర్ధారించారు. భూమి, జల, వాయు కాలుష్యంతో పాటు భూమి ఉష్ణోగ్రతలు పెరగటంలో ప్లాస్టిక్‌ నుండి విడులయ్యే ఈ రసాయన ఉద్గారాలు కూడా గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయని ప్లాస్టిక్‌ అండ్‌ క్లైమేట్‌ తన తాజా నివేదికలో తేల్చి చెప్పింది. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను సక్రమంగా శుద్ధి చేయకుండా వాటిని బహిరంగ ప్రదేశాలలో డంప్‌ చేయటం లేదా కాల్చి వేయటం వల్ల వాతావరణంలోకి పెద్దయెత్తున్న విడుదలయ్యే కర్బన కలుషితాలు భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి దోహద పడుతున్నాయని ఆ నివేదిక తెలిపింది. ప్రతి ఏడాది 850 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌తో సమానమైన గ్రీన్‌హౌస్‌ వాయువులను ప్లాస్టిక్‌ను కాల్చటం, ఉత్పత్తి చేయటం వల్ల వాతావరణంలోకి చేరుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల 1.34 బిలియన్‌ టన్నుల గ్రీన్‌హౌస్‌ వాయువులలు వాతావరణంలోకి విడుదల చేసే అవకాశముంది. ఇది భూమి మీద విడుదలయ్యే మొత్తం కర్బన ఉద్గారాలలో 14 శాతాన్ని ఆక్రమిస్తుందని, 2100 నాటికి 260 బిలియన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేసింది.
భారత్‌ది రెండవ స్ధానం
ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నేరుగా సముద్ర జలాలలోకి విడుదల చేస్తున్న దేశాల జాబితాను ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఎటువంటి శుద్ధి చేయకుండా 3,56,371 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నేరుగా సముద్ర జలాల్లోకి వదిలేస్తున్న దేశాలలో ఫిలిఫీన్స్‌ మొదటి స్ధానంలో ఉండగా, భారతదేశం 1,26,513 టన్నులతో రెండవ స్ధానంలో ఉంది. దేశంలో 60 శాతానికి పైగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు రీసైక్లింగ్‌ చేయబడుతున్నాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారత్‌లో పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ద్వారా తెలుస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) గణాంకాల ప్రకారం భారతదేశం తన ప్లాస్టిక్‌ వ్యర్ధాలలో కేవలం 12 శాతం మాత్రమే రీసైకిల్‌ చేయగలదు. ఏటా భారతదేశం 3.5 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2022 కల్లా దేశంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిస్తామని 2017లో భారత ప్రభుత్వం ప్రకటన కూడా కేవలం నీటి మీద రాతలాగే మిగిలి పోయింది.
అగ్రదేశాల అహంకారమూ ఒక కారణమే….
ప్రపంచ పర్యావరణం ముందెన్నడూ లేనంత తీవ్ర సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణం. భూమి మీద నివశిస్తున్న కోట్లాది జీవరాశుల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నారు. ప్రకృతిలో విస్తారంగా లభించే సహజవనరులను కేవలం పారిశ్రామిక అవసరాలు తీర్చే వినిమయ వస్తువులగా మాత్రమే చూసే ఆ దేశాల వ్యాపారాత్మక వైఖరే నేడు పర్యావరణం ఎదుర్కొంటున్న అన్ని అనర్ధాలకు మూలం. ఉత్పత్తి పేరుతో ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్న సంపన్న దేశాలు, బదులుగా కోట్లాది టన్నుల విష వ్యర్ధాలను తిరిగి ప్రకృతిలోకి విడుదల చేస్తున్నాయి. పెద్దయెత్తున్న విడుదలవుతున్న ఈ కలుషితాల వల్ల మానవునితో పాటు అనేక జీవుల మనుగడకు విఘాతం కలుగుతుంది.
ఆదర్శంగా నిలుస్తున్న చిన్న దేశాలు…
ప్రపంచంలోని పేరేనికగన్న దేశాలన్నీ ప్లాస్టిక్‌ వ్యర్ధాల నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే రువాండా వంటి ఒక చిన్న దేశం చిత్తశుద్ధితో ప్లాస్టిక్‌ కాలుష్యంపై ఎడతెగని యుద్ధమే చేస్తుంది. దేశంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేదించటంతో పాటు దేశంలో అన్ని రకాల ప్లాస్టిక్‌ సంచులు వినియోగాన్ని నిషేదించింది. వస్తువులను ప్లాస్టిక్‌ వస్తువులతో ప్యాక్‌ చేయకూడదని వివిధ పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్ధాలను రీసైకిల్‌ చేయటంతో పాటు, ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయడానికి ఆ దేశం చిత్తశుద్ధితో కృషి చేసింది. ప్రజల సహాకారం, ప్రభుత్వాల చిత్తశుద్ధి కలిసి 2009లో రువాండా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్‌ రహిత దేశంగా అవతరించింది. ఈ దేశంలో ఎవరైనా ప్లాస్టిక్‌ సంచులు వినిమోగిస్తు పట్టుబడితే 6 నెలలు జైలు శిక్ష విధించటంతో పాటు పెద్దమొత్తంతో జరిమానా విధిస్తారు. దేశంలోకి ఇతర దేశాల నుండి వచ్చే ప్లాస్టిక్‌ను నియంత్రించడానకి కూడా రువాండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలో ప్రవేశించే అన్ని వాహానాలను, లగేజీని సరిహాద్దులోనే తనిఖీ చేయటంతో పాటు ప్లాస్టిక్‌ వస్తువులు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. సుమారు కోటి 35 లక్షల జనాభా కలిగిన ఒక చిన్న ఆఫ్రికా దేశం ప్లాస్టిక్‌ వ్యర్ధాల నిర్వాహాణ , నిషేదాలలో ప్రపంచ దేశాలను మార్గదర్శకంగా నిలవటం చాలా అభినందనీయం. కెన్యా, కెనడా దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
పునర్వినియోగమే ప్రత్యామ్నాయం
ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్రపంచదేశాలకు కొన్ని కఠినమైన మార్గదర్శకాలను రూపొందించాలని యున్‌ఇపి అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా 2024లో మొట్టమొదటి ప్రపంచ ప్లాస్టిక్‌ కాలుష్య నియంత్రణా ఒప్పందాన్ని నిర్మించాలని, ఆ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలని యుఎన్‌ పర్యావరణ అసెంబ్లీ గత ఏడాది చారిత్రాత్మకమైన తీర్మానాన్ని ఆమోదించింది. దానితో పాటు ఇంటర్‌ గవర్నమెంటల్‌ నెగోషియేషన్‌ (ఐఎన్‌సి) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తిని పూర్తిగా నిషేదించటంతో పాటు, ప్లాస్టిక్‌ వ్యర్ధాలను రీసైకిలింగ్‌ చేసే దిశగా దేశాలను కార్యొన్ముఖులను చేయాలని ఐక్యరాజ్యసమితి భావిస్తుంది. భవిష్యత్తు తరాలను, పర్యావరణాన్ని ప్లాస్టిక్‌ భూతం నుండి కాపాడాలంటే తక్షణమే ప్లాస్టిక్‌ వ్యర్ధాలను వెదజల్లుతున్న కాలుష్య కేంద్రాల ‘ట్యాప్‌’ కట్టేయటం ఒక్కటే పరిష్కారమని ఐకాస స్పష్టం చేసింది. లేకపోతే రానున్న రోజుల్లో బయోస్పియర్‌గా పిలువబడే భూగోళం ప్లాస్టిక్‌ స్పియర్‌గా మారిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.
సమస్త మానవులారా… ఏకం కండి
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్‌ కాలుష్యంతో పాటు, మానవాళితో పాటు జీవరాశి మనుగడకు పెద్దఎత్తున్న విఘాతం కలిగిస్తున్న పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రపంచంలోని దేశ, ప్రాంత, వర్గ, వర్ణ, కుల, మత, జాతి లింగ భేదాలకు అతీతంగా ప్రపంచ మానవులంతా ఏకం కావాల్సిన తరుణమిది. కాలుష్యం అన్నది ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో సంబంధించిన సమస్య కాదు. నేడు అది ప్రపంచ సమస్య, దాన్ని పరిష్కరించాలంటే ప్రపంచమంతా ఒక్కటి కావాలి. అదే 50 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రపంచ పర్యావరణ దినోత్సం మనకందిస్తున్న స్ఫూర్తి. ప్రధానంగా ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించాలంటే ఆధునిక మానవుని జీవన విధానంతో పాటు, ఆలోచనా విధానంలో కూడా మౌళికమైన మార్పులు రావాలి.
|- కె.శశిధర్‌, 9491991918 

Spread the love