పంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

– సమ్మెను విరమింపచేయాలి
– సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ఇటీవల భారీవర్షాలకు 18 మంది మరణించగా, పది మంది గల్లంతయ్యారని తెలిపారు. వందలాది పశువులు వరదల్లో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. వరదలు, భారీ వర్షాల కారణంగా చెత్తపేరుకుపోయి గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ఫలితంగా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, డయేరియాలాంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాద ముందని వైద్యులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. పరిసరాలను శుభ్రం చేయడంలో గ్రామపంచాయతీ సిబ్బందిదే కీలకపాత్ర అని వివరించారు. గత 23 రోజులుగా వారు సమ్మెలో ఉన్నారని గుర్తు చేశారు.