పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

– జులై 6 నుంచి నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బిసా సాయిబాబు
నవతెలంగాణ-కొత్తూరు
గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని 6న చేపట్టే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బిసా సాయిబాబు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొత్తూరు మండల పరిషత్‌ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్‌ 60 అమలు చేసి పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్సస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దుచేసి కరోబార్‌, బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించి పెండింగ్‌ బిల్లును తక్షణమే విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో సుమారు 50 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని అందులో పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్‌ కలెక్టర్లు వివిధ రంగాలలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు టంగుటూరి నరసింహారెడ్డి, పంచాయతీ కార్మికులు సాయిలు, భారతమ్మ, జంగమ్మ, బిక్షపతి, దేవయ్య, మైసమ్మ, పాండు నాయక్‌, చంద్రమ్మ, పద్మమ్మ, చంద్రయ్య, మల్లమ్మ, యాదగిరి, పాండు పాల్గొన్నారు.