మొక్కల్లో కంటికి కనిపించని పరాగ రేణువులు ఉంటాయని ఎవరికైనా తెలుసు. కాని వాటి ద్వారా అందమైన వస్త్రాలు డిజైన్ చేయొచ్చని ఎంతమందికి తెలుసు. ఆ అద్భుతాన్నే చేశారు శివాని నేత. ఆకర్షణీయమైన ఆకృతులను మైక్రోస్కోప్ ద్వారా గుర్తించి ఆ రూపాలతో వస్త్రాలకనుగుణంగా ప్యాట్రన్స్ తయారుచేశారు. వాటిని దుస్తులపై కొత్తగా డిజైన్స్ రూపొందించి.. ‘పరాగ మంజరి’ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. తన ప్రొఫెసర్ డా.అల్లం విజయ భాస్కర్‌రెడ్డి ఆలోచనలకు రూపం తీసుకొస్తూ ప్రాణం పోసిన ఆమె పరిచయం నేటి మానవిలో…
శివానీకి బాల్యం నుంచి డ్రాయింగ్ అంటే అమితంగా ఇష్టపడేది. అది ఆమెకు కలిసి వచ్చింది. ఆమె అభిరుచిని గ్రహించిన అసోసియేట్ ప్రొఫెసర్.. ప్రాజెక్టును అప్పగించగా దానికి ప్రాణం పోశారు శివాని.
పువ్వుల్లో దాగివున్న పుప్పొడితో..
ఓయూలో ఉన్న వివిధ రకాల మొక్కల నుంచి పుష్పాలు సేకరించి వాటి నుంచి పరాగ రేణువులను వేరు చేసి వాటి ఆకృతులను మైక్రోస్కోప్ ద్వారా శివాని గుర్తించారు. ప్రతి మొక్క ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా వివిధ రూపాల్లో (డిజైన్స్) పరాగ రేణువులను కలిగి ఉంటుందని ఆమె గ్రహించారు. ఆ రూపాలను వివిధ వస్త్రాలకు అనుగుణంగా ప్యాట్రన్స్ తయారు చేసి.. కొత్తగా డిజైన్స్ రూపొందించారు. ఇలా ప్రత్యేకంగా గుర్తించి రూపొందించిన ఈ డిజైన్‌కు ”పరాగ మంజరి”గా నామకరణం చేశారు. పరాగ అంటే పుప్పొడి, మంజరి అంటే డిజైన్. సంస్కృత భాష నుంచి ఈ పదాలు తీసుకొని ”పరాగ మంజరి” అనే పేరును ఎంపిక చేశారు.
ఇతర వస్త్ర కళారూపాలకన్నా భిన్నం
ఇప్పటికే మన రాష్ట్రంలో పోచంపల్లి, కలంకారి, ఇక్కత్, ధర్మవరం వంటి వస్త్రాల కళారూపాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ ప్రాజెక్టు ద్వారా గుర్తించిన సరికొత్త వస్త్ర కళారూపమే ఈ పరాగ మంజరి.. ఇది సరికొత్తది, అలాగే ఎంతో భిన్నమైనది.
ఫ్యాషన్ డిజెనింగ్, టెక్స్‌టైల్ డిజెనింగ్‌కు ఊతం
ఈ పరాగ మంజరి వస్త్ర కళారూపంలో పలు నూతన భిన్నమైన వస్త్ర కళాకృతులను సృష్టించొచ్చు. కంటికి కనిపించని ఈ సూక్ష్మమైన పరాగ రేణువులు ఎంతో ఆకర్షణీయమైన, భిన్నమైన ఆకృతులను కలిగి ఉండటం వల్ల పరాగ మంజరి వస్త్ర కళారూపం ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భౌగోళిక ప్రాంతాల్లో ఉండే మొక్కలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటూ వేరు వేరు ఆకృతుల పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తాయి. ఆ పరాగ రేణువులను పరాగ మంజరి నూతన వస్త్ర రూపం ద్వారా విభిన్న ఆకృతుల్లో వస్త్రాలు రూపొందించటానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది కొత్త ప్రాజెక్టు కావడంతో మేధో సంపత్తి హక్కు (పేటెంట్ హక్కు)కు దరఖాస్తు చేయబోతున్నట్టు ఆమె చెప్పారు.
50 రకాల మొక్కల నుంచి..
ఈ ప్రాజెక్టులో భాగంగా 4 నెలల్లో 50 రకాల మొక్కల పరాగ రేణువులను గుర్తించి వాటి ఆకృతులను ఉపయోగించి 10 రకాల లేఔట్స్ (డిజైన్స్) రూపొందించారు. పలు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన జర్నల్స్‌లో ప్రచురణ కోసం పంపారు.
– శ్రీనివాస్
నవతెలంగాణ ఓయూ విలేకరి.
పరాగ రేణు శాస్త్రంలోనే నూతన శాఖ ఆవిర్భావం
”పరాగ మంజరి”తో పరాగ రేణువు శాస్త్రంలోనే ఒక నూతన శాఖ ఆవిర్భవించింది. మొదటి నుంచి పరాగ రేణువు శాస్త్రంపై నాకు ఎంతో ఆసక్తి, అభిరుచి ఉండేది. ఎమ్మెస్సీ కూడా పరాగ రేణు శాస్త్రంలోనే అభ్యసించాను. 2013లో ఓయూలో సహాయ ఆచార్యులుగా చేరిన అనంతరం పరాగ రేణువు శాస్త్రంలో పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తూ 60 పేపర్స్ పబ్లిష్ చేశాను. ఈ పరాగ రేణువు అందమైన ఆకృతులను ఉపయోగించి ఏదైనా నూతన కళ వస్త్ర రూపాన్ని తయారు చేయాలని ఆసక్తి ఉండేది. నా విద్యార్థిని శివానికి డ్రాయింగ్‌పై మంచి ప్రావీణ్యం, అభిరుచి ఉండటం గుర్తించా.. దీంతో పరాగ మంజరి నూతన వస్త్ర కళారూపం ప్రాజెక్టు ఆమెకి అప్పగించాను. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో అందమైన ఆకృతులు రావడం పరాగ మంజరి ఒక కొత్త వస్త్ర కళారూపంగా ఆవిర్భావం పోసుకోవడం సంతృప్తినిచ్చింది.
– డాక్టర్ అల్లం విజయభాస్కర్ రెడ్డి
డ్రాయింగ్ అభిరుచి ప్రోత్సాహానిచ్చింది
పరాగ మంజరి ప్రాజెక్టును నాకు అప్పగించిన విజయభాస్కర్ రెడ్డి సార్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. పరాగ రేణువులు కంటికి కనిపించవు. మైక్రోస్కోప్ ద్వారా చూస్తే వాటిలో ఉన్న రకరకాల ప్యాట్రన్స్ ఉంటాయని గుర్తించా. తద్వారా పరిశోధన చేశాను. పుప్పొడి నుంచి టెక్స్‌టైల్ డిజైన్‌ను చేస్తాం. పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించి మైక్రోస్కోప్ ద్వారా చూస్తే వచ్చే పలు రకాల ప్యాటన్స్‌ను డిజైన్ చేశాం.
– శివాని