జిత్తులమారి గుంట నక్కలు
బాహాటంగానే ఊళ పెడుతున్నాయి,
నీ సహజీవన సంస్కతి నుండి
నిన్ను వేరుచేయడానికి కుట్రలు చేస్తుంటాయి..!
నువ్వు చైతన్యమై కనిపించినపుడు
స్థూలంగా నిన్నొక మతంగా
సూక్ష్మంగా నిన్నొక కులంగా
విడగొట్టి పడగొట్టే ప్రయత్నం చేస్తుంటాయి..!
భిన్నత్వంలో ఏకత్వం నుండి చీల్చి
నిన్ను విభజించి పాలించడానికి
వారి ఆటలో పావుగా చేసుకోవడానికి
నీ మత విశ్వాసాల్ని సైతం ఫణంగా పెడతాయి.!
పాలనా కర్తవ్యాలను మరిచి
మేనిఫేస్టో తాయిలాలతో మురిపించి
తమ స్వార్థాలను సొమ్ము చేసుకునేందుకు
ఓట్ల పండుగకు సిద్ధమవుతున్నాయి..!
బహుపరాక్..! పారాహుషార్..!
రాజకీయపు ఎత్తుగడలకు లొంగిపోకు
మనీ, మద్యం, మాంసానికి
వజ్రాయుధమైన నీ ఓటును బలి చేయకు..!
బహుపరాక్..! పారాహుషార్..!
నీ చైతన్యమే నీకు దారి చూపుతుంది..!
కుల, మత, వర్గ రహితంగా ఎన్నుకుంటేనే
ప్రజాస్వామ్య సంస్కతి వికసిస్తుంది..!!
– డా|| వాసాల వరప్రసాద్, 9490189847