– చాంపియన్స్‌గా మెన్స్, ఉమెన్స్ జట్లు ొఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 4
పారిస్ : ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 4లో భారత ఆర్చర్ల గురి అదిరింది. టోర్నీలో ఏకంగా నాల్గో పసిడి పతకం సాధించిన టీమ్ ఇండియా.. శనివారం టీమ్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల కాంపౌడ్ జట్టు ఓజాస్, ప్రతమేశ్ జాకర్, అభిషేక్ వర్మ త్రయం పసిడి వేటలో అమెరికాపై గెలుపొందారు. 236-222తో అమెరికా ఆర్చర్లను ఓడించారు. 59-60, 59-58, 58-58, 60-56తో ఆఖరు రౌండ్లో స్వర్ణం కైవసం చేసుకున్నారు. మహిళల కాంపౌండ్ విభాగంలో ప్రపంచ చాంపియన్ త్రయం వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్ గోల్డ్ మెడల్ రౌండ్లో మెక్సికోపై ఉత్కంఠ విజయం సాధించారు. 234-233తో పాయింట్ తేడాతో భారత త్రయం బంగారు పతకం నెగ్గింది. 59-59, 59-58, 57-59, 59-57తో ఉత్కంఠగా సాగిన పసిడి వేటలో ఆఖరు రౌండ్లో సురేఖ, అదితి, కౌర్ పైచేయి సాధించారు. మహిళల వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ కాంస్యం దక్కించుకుంది. సెమీస్‌లో వరల్డ్ నం.1 చేతిలో 148-150తో నిరాశపరిచిన జ్యోతి.. కాంస్య పతక షూట్‌ఆఫ్‌లో పైచేయి సాధించింది. కాంపౌండ్ విభాగంలో రెండు పసిడి, ఓ కాంస్యం సహా రికర్వ్ విభాగంలో భారత్ రెండు కాంస్య పతకాలు సాధించింది.