
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ-కంటేశ్వర్ : పశు మిత్రులను వర్కర్లుగా గుర్తించి కనీస వేతన ఇవ్వాలని పశుమిత్రులు వ్యక్తి చాకిరి చేస్తున్న సిబ్బంది సమస్యలను విస్మరించడం సరైన పద్ధతి కాదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూజాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగం అత్యంత కీలకమైనది. వ్యవసాయానికి పాడి పరిశ్రమ ముఖ్యమైనది, పాడి పరిశ్రమ బాగోగులు చూసే పశుమిత్రల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న ఈ తరుణంలో పశుమిత్రలను వర్కర్లుగా గుర్తించాలని, కనీస వేతనం చెల్లించాలని యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాము. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలో చురుకుగా ఉన్న సభ్యురాలిని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చి పశుమిత్రగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మందిని నియమించడం జరిగింది. ఈ సిబ్బంది అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన బడుగు బలహీన తరగతుల మహిళలు. పశుమిత్రలు పశుపోషకులకు పశు సంవర్ధక శాఖకు మధ్య వారధిలా పనిచేస్తూ పశువులకు వైద్య సేవలు, పశు పోషణపై అవగాహన కల్పిస్తూ పళూత్పత్తుల మార్కెటింగ్ సమాచారం, పశువుల బీమా మొదలైన సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ నివేదిక ప్రకారం తెలంగాణలో ఉన్న సుమారు మూడు కోట్ల యాభై లక్షల మూగ జీవాలకు మసూచి, గాలికుంటు, నీలి నాలుక, గొంతు వాపు, మూతి, కాలి పుండ్ల వంటి పన్నెండు నుండి ఇరవై రకాల వ్యాధులకు, వైరస్లకు క్షేత్రస్థాయిలో చికిత్స చేస్తున్నారు. పశు గణస కోసం పశువులకు ట్యాగులు వేస్తూ, పశువుల గాయాలకు డ్రెస్సింగ్ చేస్తూ క్రమానుసారంగా పట్టల మందు, వాక్సినేషన్ చేస్తూ పశువుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉంటారు. పశుమిత్రలు పశువులకు వైద్యం చేస్తున్న క్రమంలో పశువుల దాడులకు గురౌతూ, వాటికి సోకిన వైరస్ వీరికి కూడా సోకుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తున్నారు.దేశ ఉత్పత్తిలో రెండవ భాగంగా ఉన్న పశుసంపదను పరిరక్షస్తున్న పశుమిత్రలకు ప్రభుత్వం ఎలాంటి వేతనం గానీ,పని భద్రత గానీ కల్పించకపోవడం సరైనది కాదు. అడగకుండానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు. 8 సం||ల నుండి వెట్టి చాకిరీ చేస్తున్న ఈ సిబ్బంది సమస్యలను విస్మరించడం సరికాదు. ఈ నేపథ్యంలో దిగువ పేర్కొన్న పశుమిత్రల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నామన్నారు. లేనియెడల ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పశుమిత్రల పనికి తగిన వేతనం ఇవ్వాలి.పశుమిత్రలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పశుమిత్రలకు యూనిఫాం, బ్లౌజులు, మాన్కులు, మందులతో కూడిన కిట్ ఇవ్వాలి. ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి.పని భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలి.కృత్రిమ గర్భధారణ శిక్షణ (ఎఐ) పశుమిత్రలందరికీ ఇవ్వాలి. పశుమిత్రలందరికీ సబ్సిడీపై ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైకులు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు, మౌనిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.