సింగరేణి ఉద్యోగులకు ఏరియర్స్‌ చెల్లింపు

For Singareni employees Payment of arrears– సంపాదనలో 49శాతం కోత
– ఆదాయ పన్ను మినహాయింపుపై కార్మికుల ఆగ్రహం
నవతెలంగాణ – సింగరేణి ప్రతినిధి
11వ వేజ్‌ బోర్డు ఏరియర్స్‌ రూ.1450కోట్లు సింగరేణి ఉద్యోగుల బ్యాంక్‌ ఖాతాల్లో గురువారం మధ్యాహ్నం జమ చేశారు. అయితే, వచ్చిన డబ్బుల్లో ఎక్కువగా ఆదాయపు పన్ను కింద కోత విధించడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా యాజమాన్యం వెల్లడించిన విధంగా ప్రస్తుతం సర్వీసులో ఉన్న 39,413 మంది ఉద్యోగులకు 23నెలల ఏరియర్స్‌ డబ్బులు జమ చేశారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.3లక్షల70వేల ఏరియర్స్‌ లభిస్తుందని సింగరేణి డైరెక్టర్‌(పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులకు లభించే ఏరియర్స్‌ డబ్బుల వివరాలను బుధవారం రాత్రి వెల్లడించారు. డబ్బుల వివరాలను పొందుపరుస్తూ ముద్రించిన చీటీలను కూడా కార్మికులకు అందజేశారు. అయితే, కార్మికుల కష్టార్జితం నుంచి 30శాతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూపేనా కోత విధించడం పట్ల కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుడు సంపాదించే ప్రతి పైసా నుంచి ఆదాయం పన్ను రూపేనా ప్రభుత్వాలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. అవే డబ్బులను బ్యాంకులో దాచుకున్నా, సరుకులు కొనుగోలు చేసినా జీఎస్టీ, సీఎస్‌టీల పేరా మళ్లీ కోతలు విధించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఒకే ధపా ఏరియర్స్‌ చెల్లించడం వల్ల ఆదాయపు పన్ను స్లాబులు మారి కార్మికులు ఎక్కువ మొత్తంలో ఆర్థికంగా నష్టపోయారు. 12శాతం సీఎం పీఎఫ్‌, 7శాతం పెన్షన్‌ కోసం ఏరియర్స్‌ డబ్బుల నుంచి మినహాయింపు చేసుకున్నారు. చాలామంది కార్మికులు తమకు వచ్చిన ఏరియర్స్‌ డబ్బుల నుంచి 49శాతం మినహాయింపు చేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచి ఆదాయపన్ను రూపేనా తిరిగి దోచుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆదాయంపై విధించే పన్నును సింగరేణి యాజమాన్యమే చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.సింగరేణి భవన్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 12గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా ఏరియర్స్‌ డబ్బులు చెల్లించే విధంగా డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్‌, జీఎం(కో ఆర్డినేషన్‌) ఎం.సురేష్‌ ఏర్పాటు చేశారు. త్వరలో దసరా అడ్వాన్స్‌, దీపావళి బోనస్‌ల చెల్లింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.