శాంతి ఒక్కటే సరియగు సాల్వేషన్‌

జీవపరిణామ సిద్ధాంతాన్ని సిలబస్‌ నుంచి తొలగించుకున్న నేటి తరుణంలో… జీవి పుట్టుక గురించి తెలుసుకోవడానికి, ”భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో/ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో” అని మళ్లీ, మళ్లీ పునరుచ్చరణ చేసుకోవాలి. దేశమంతా గాడాంధకారం అలుముకున్న పరిస్థితులపై సమరభేరి మోగించాల్సిన సమయంలో మనం మరోసారి దాశరథిని స్మరించుకుంటున్నాం. ”ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో/ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో…” అంటూ చరిత్రను శోధించి, నిజాలను గుప్పిట పట్టుకుని విశ్వగీతమయ్యాడు. ఒకే ఒక్క వాక్యంలో మానవ పరిణామ వాదాన్నీ కండ్లముందుంచాడు. భూత భవిష్యత్‌ వర్తమానాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ గీతం ఆయన చారిత్రక దృష్టికి ఓ మచ్చుతునక. గతితార్కిక చారి త్రక భౌతికవాద స్ఫూర్తికి ప్రతీక.
నిద్రాణమై ఉన్న తెలంగాణ సమాజాన్ని తన కవితాస్త్రాలతో మేలుకొలిపాడు. కవిత్వంలో పోరాటాన్నీ, పోరాటంలో కవిత్వాన్నీ మమేకం చేసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సుసంపన్నం గావిం చాడు. నిజాం రాచరికపు క్రూరమైన దోపిడీ, రజాకార్‌ దౌర్జన్యాలకు ఎదురు తిరిగి మహౌజ్వలంగా పోరాడిన తెలంగాణ రైతాంగం ఆయన రచనల్లో సజీవంగా కనిపిస్తారు. కవిగా, కమ్యూనిస్టు కార్యకర్తగా ఏకకాలంలో ద్విముఖ కర్తవ్యాన్ని అద్వితీయంగా నిర్వహించాడాయన. ఈ కర్తవ్య నిర్వహణలో నిర్బంధాలకు సైతం జడవక నికరంగా నిలబడ్డాడు… తెలంగాణ సాయుధపోరాటంతో ఏ మాత్రం సంబంధం లేనీ, పాల్గొనని పార్టీ, చరిత్రంతా తమకే తెలుసంటూ ‘రజాకార్‌ ఫైల్స్‌’ అంటూ సినిమా వస్తున్న సందర్భంలో దాశరథిని మన చదవాల్సిన అవసరం ఉంది.
”ఓ నిజాం పిశాచమా… కానరాడు నిన్నుమించిన రాజు మాకెన్నడేని” అంటూ జైలుగోడలపై ప్రతిధ్వనించాడు. జైలులో ఉండి కూడా ప్రజారాజ్యాలను అన్వేషించాడు. పేదవాడి నెత్తుటి చుక్కల్లో విప్లవాలను వెతికాడు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్గిరవ్వలు చేసి నిజాం రాచరికంపై దండయాత్ర చేసాడు.
”దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు
దిగిపోమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది
దిగిపోవోరు, తెగిపోవోరు”
అని నిజాంను గద్దించాడు. భావ ప్రేరిత ప్రసంగాలతో గర్జించాడు. ఊరూరా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించాడు. మన కవుల్లో చాలామందిలో కవిత్వంలో కనిపించిన పోరాటం జీవితంలో కనిపించదు. కానీ దాశరథి కవిత్వంలోనే కాదు జీవితంలోనూ పోరాట యోధుడే… గడీలను ఎదిరించినందుకు… జైలు గోడల మధ్య బంది అయ్యాడు. అయినా వెనుదిరగలేదు. కవిగా కదిలించాడు. నడిపించాడు. ”నాపేరు ప్రజాకోటి – నా ఊరు ప్రజావాటి” అని సగర్వంగా ప్రకటించడమే గాక ”కంటికి కనిపించిందంతా – కైతగా రాస్తున్నాన”ని చెప్పాడు. నేటి తరం దాశరథి నుండి గ్రహించాల్సిందిదే. దాశరథి తరువాత కాలంలో సినిమా గీతాలు రాసినా, ఆస్థానకవి కొలువులో చేరినా ఆయన ప్రజా జీవితం నుండి, పోరాటాల నుండి చేసిన రచనలే ఆయనను చరిత్రలో గొప్ప వ్యక్తిగా, శక్తిగా నిలిపాయన్నది వాస్తవం. అలాగని ఆయన సినీ ప్రస్థానాన్ని తక్కువ చేసి చూడలేం. ఆయన కలం ప్రళయాగ్నులే కాదు ప్రణయామృతాలూ వర్షించింది…
”తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ”
అని జన్మభూమిని ఎలుగెత్తిన ఆ కలమే…
”గోదారీ గట్టుందీ గట్టు మీదా చెట్టుందీ”
అని చిలిపిగా ప్రశ్నించింది. అది ప్రణయగీతమైనా, కరుణరస రాగమైనా, యుగళగీతమైనా, మానవత్వం పరిమళించే ఉదాత్త కవిత్వమైనా ఆయన కలం అలవోకగా వొలికించింది.
”జెండా ఒక్కటె మూడు వన్నెలది దెశంబొక్కటే భారతా
ఖండాసేతు హిమాచలోర్వర కవీట్కాండంబులోనన్‌ రవీం
ద్రుండొక్కండె కవీంద్రుడూర్జిత జగద్యుద్యాలలో శాంతికో
దండోద్వద్విజయుండు గాంధి ఒక్కడే తల్లీ మహాభారతీ”
అని వర్ణించాడు. భారత దేశం ఒక్కటే, మువ్వన్నెల జెండా ఒక్కటే. మహా కవి రవీంద్రుడు ఒక్కటే. ప్రపంచానికి ఆచరణాత్మకంగా దారి చూపిన గాంధీ ఒక్కడే అని దేశమాతకు ప్రణమిలుతాడు. ప్రతి మార్పును స్వీకరించిన పరిణామం చెందాడు. పరిస్థితుల్ని చీల్చి చెండాడు. అక్షరాల్ని వివిధ ప్రక్రియల్లో విత్తి మట్టిపొరల్లో మొలకెత్తిన విత్తనంలా ఆవాజ్‌ చేస్తూనే ఉంటాడు. ఎదిగినా ఒదిగిపోయే తత్వం దాశరథిలో కనవడుతుంది.
”అడుగడుగుకూ మడుగులు కట్టిన యెడద నెత్తురులు వడబోయించి పక్కుకట్టిన గాయాన్ని నొక్కి నెత్తురు చుక్కలు పిండి పక్కున నవ్వే ఆ నక్కలు..” ఈ పద్యం మణిపూర్‌లో నెలకొన్న నేటి వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది.
”రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్‌!
బుర్రలు బుర్రలు పగులక సమస్యకు లేదా సొల్యూషన్‌?
హింసాయుద్ధం ఔట్‌డేటెడ్‌ అని నేనంటాను
శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్‌”
అంటూ ఈ పరిణామాలకు ఆయనే ఒక సొల్యూషన్‌ కూడా చూపించాడు. కానీ, నిత్యం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకునే పాలకులకు అది రుచించదు కదా! ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ రచనకైనా జీవితమే ముడిసరుకు. అందుకే రచయితలు ప్రజల మధ్యకు వెళ్లాలి. ప్రజలతో మమేకమవ్వాలి. ప్రజలంటే ఎవరు..? మనం ఎవరికోసం రాస్తున్నామో, ఎవరి విముక్తిని కోరుతున్నామో వారే మన ప్రజలు. ఏ రచనకైనా గ్రంథజ్ఞానం ఎంత ముఖ్యమో ప్రత్యక్ష జీవిత పరిజ్ఞానమూ అంతే ముఖ్యం. అది కథైనా, కవితైనా మరే రచనైనా జీవితమే ప్రేరణకావాలి. అప్పుడే అందులో జీవం ఉంటుంది. నిజమైన కవినీ, కళాకారుడినీ ప్రజలూ, వారి ఆశలూ, నిరాశలూ, ఉద్య మాలూ, జీవన పోరాటాలూ ఎంతగా కదిలించగలవో, ఎంతటి అపురూప సాహిత్య సృష్టికి దోహదం చేయగలవో అనేదానికి దాశరథి రచనలే ఓ ప్రత్యక్ష ఉదాహరణ.
(నేడు దాశరథి 98వ జయంతి)
అనంతోజు మోహన్‌కృష్ణ
8897765417