పురాణేతి హాసాల్లోంచి ఏరిన ముత్యాలు

Pearls born from legendsరెండు కొమ్ముల రుషి
పురాణాల కథలు
రచన : సుధామూర్తి,
తెలుగు అనువాదం : ముంజులూరి కృష్ణకుమారి,
పేజీలు : , వెల : 225/-,
ప్రతులకు: అనకనంద ప్రచురణలు.
జాతి ఎంతటి ప్రాచీనమైనది అయితే, అన్ని పురాణ ఇతిహాస కథలు ఉత్పన్నమవుతాయి. పురాణాలు, నమ్మకాలు, ఇతిహాసాలు చరిత్రను ఆధారం చేసుకుని ఉద్భవించినవి అయి వుంటాయి. ప్రాచీనాలైన గ్రీకు, భారతదేశాలలో ఇట్లాంటి కథలు వేలకు వేలు వున్నాయి. ఇవి చదువరిని అద్భుతలోకాలకు తీసుకువెళ్లగలుగుతాయి. విస్మయానందాలకు గురిచేస్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘ఇన్ఫోసిస్‌’ సంస్థకు అనుంధితమైన ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా దేశమంతా పేరుగాంచిన శ్రీమతి సుధామూర్తి ఆంగ్లం, కన్నడ భాషలలో లెక్కకు మిక్కిలి నవలలు, కథలు, పిల్లల కథలు వ్యాసాలు రాశారు. ఇవి ఇతర భాషలలోకి అనువదింపబడి, మూల రచనలంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.
ప్రస్తుత పురాణాల అసాధారణ కథలు తెలుగులోకి ముంజులూరి కృష్ణకుమారి అనువదించారు. తెలుగునాట ఇవి తెలిసిన కథలే కనుక అంతగా అసాధారణం అనిపించవు.
ఈ 33 కథలు 5 అధ్యాయాలుగా వివరించబడ్డాయి. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుది. జ్ఞాననేత్ర వికాసానికి గురువులు ఎంతో అవసరం. యముడిని ఎదిరించిన నచికేతుడు తెగిపడిన నీటికట్టకు తానే అడ్డం పడుకుని ఊరిని రక్షించిన అరుణి, 8 అవకరాల అష్టావక్రుడు, గురువు ఆజ్ఞను శిలాశాసనంగా భావించి ప్రవర్తించిన ఉపమన్యుడు, సముద్ర జలాన్ని పుక్కిట పట్టిన ఆగస్త్యుడు లాంటి వారల పరిచయాలు మొదటి అధ్యాయంలో వున్నాయి.
అవంతికా రాజ్యాన్నేలిన జ్ఞాని నీతి శతక రచయిత భర్తృహరి, భారతదేశపు మొదటి రాత/ లిపి సృష్టికర్త అయిన బ్రాహ్మి తండ్రి, రుషభదేవుడు (జైనతీర్థంకరుడు), రాజునే శపించినగలిగిన తమిళ స్వాధ్వి కన్నాగి, జనరంజకంగా పాలించి శాశ్వత కీర్తినందించిన బాహుబలి (కర్ణాటకలో వీరి 59 అడుగుల అందమైన విగ్రహం వున్నది). ఎనలేని దానాలతో పేరుగాంచిన రంతిదేవుని కథ, మహాబలశాలి అయిన భీముడినే బంధించగలిగిన కొండచిలువ రూపమెత్తిన నహుషుడు (అన్న ధర్మరాజు యక్షప్రశ్నలకు జవాబులు చెప్పి తమ్ముడిని విడిపించుకుంటాడు). తన శరీరంలోని మాంసమే పావురానికి బదులుగా దానమిచ్చిన శిబిచక్రవర్తి. కోపిష్టి దుర్వాసముని గర్వమణచిన అంబరీష మహారాజు, బాలుడైనా పట్టువీడక తపస్సు చేసి చిరయశస్సుతో ధృవతారగా నిలిచిన ధృవుడు లాంటి మహనీయులు మనకు పరిచయమవుతారు. వృత్తి ఎంతటి హేయమైనా, పాటించటంలోనే ధర్మం వుందని నిరూపించిన ధర్మవ్యాధుడు అనే కటికవాడు గురించి తెలుసుకుంటాం. కష్టాలు, శాపాలు, ఒక్క కర్ణుడికే కాదు, కృష్ణుడి లాంటి మహా పురుషులకు ఉంటాయని ‘అజేయులైన యువరాజులు’ లో చదివి తెలుసుకుంటాం. జడభరతుడు భక్తుడైన వాగ్గేయకారుడు పురందరదాసు గురించి ‘ఒకేరకం ముక్కుపుడకలు’ అనే కథలో తెలుస్తుంది.
కాళీదాసు మహాకవి, రుష్యశృంగుడు, దత్తాత్రేయుడు, విక్రమార్కుడు, అయ్యప్ప, నవగ్రహాల ప్రాశస్థ్యం చివరి భాగంలో ఇచ్చారు.
చిన్నచిన్న వాక్యాలు క్లుప్తత, సంక్షిప్తతతో అలరారే ఈ పురాణ, ఇతిహాస కథల సంపుటి బాలలకు మంచి మార్గదర్శి అవుతుంది. ఎన్నో నీతులు, ఆదర్శ ధార్మిక జీవన రీతుల ప్రాశస్థ్యాన్ని తెలియపరుస్తుంది ఈ కథా సంకలనం.

– కూర చిదంబరం, 8639338675