– ‘వరల్డ్ టూరిజం డే’ సందర్భంగా అవార్డుల అందజేత
– తెలంగాణ హస్తకళలు, పర్యాటక కేంద్రాలకు లభించిన గుర్తింపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలను తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన పెంబర్తి, సిద్ధిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ లు దక్కించుకున్నాయి. బుధవారం ‘వరల్డ్ టూరిజం డే’ సందర్బంగా ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ సెక్రెటరీ విద్యావతి ఈ అవార్డులను అందజేశారు. తెలంగాణకు దక్కిన అవార్డులను రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలాజా రామయ్యర్, సిద్దిపేట్ జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, చంద్లాపూర్ గ్రామ సర్పంచ్ సూరగోని చంద్రకళలు అందుకున్నారు. కాగా ఇత్తడి, కంచు లోహాలతో తయారు చేసే దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులతో పెంబర్తి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. అలాగే రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతా లు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందడంతో పాటు ఇక్కడి గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా చంద్లాపూర్ ఉత్తమ గ్రామంగా నిలిచింది.
సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రానికి అవార్డుల పంట : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశం, కృషి వల్లే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ అవార్డులను అందుకున్న పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యార్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. పర్యాటక రంగంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నామని తెలిపారు.