‘ఉపాధిహామీ’ సిబ్బందికి జరిమానా

నవతెలంగాణ-ఆత్మకూర్‌
ఉపాధిహామీ పథకంలో అవకతవకలకు బాధ్యులైన సిబ్బందికి డీఆర్‌డీఓ ఆకవరం శ్రీనివాస్‌కుమార్‌ జరిమానా విధించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ర్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన బుధవారం సోషల్‌ ఆడిట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుగా కాగా శాట్‌ సిబ్బంది ప్రజా వేదిక నివేదికను వినిపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరమునకు గాను రూ.4,41,99,264 కోట్ల పనులను ఎస్‌ఆర్‌పి నర్సయ్య ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బృందం 12 రోజులపాటు గ్రామాలలో పరిశీలించి చివరి రోజైన మండల స్థాయిలో ఇన్‌హౌస్‌ ద్వారా డిఆర్‌డిఓ సమక్షంలో సంబంధించిన సోషల్‌ ఆడిట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డిఆర్‌డిఓ శ్రీనివాస్‌కుమార్‌ సమక్షంలో మండలంలోని అన్ని గ్రామాల ఉపాధి హామీ పనుల రికార్డులను పరిశీలించగా తిరుమలగిరి,కామారం, లింగమడుగుపల్లి గ్రామాల్లో తప్పుడు కొలతలు చేయడం వల్ల ఎక్కువ నిధులు పోయాయని నిధులు దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు శ్రీధర్‌,సురేష్‌ ల నుండి 10530 రూపాయలు, ఎస్టిమేట్‌ అధికారి రాము నుండి రూ.1581, పంచాయతీరాజ్‌ ఏ.ఈ లత నుండి 1000 రూపాయలు రికవరీ చేస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది కూలీలను ఎక్కువగా పెంచి ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ఎవరు కూడా పనులు లేక ఇబ్బంది పడవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కూలీలు చేసిన పనీలో కొలతలు సరిగా తీసుకుని వారు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సమావేశంలో ఏపీవో రాజిరెడ్డి, వివిధ గ్రామాల కార్యదర్శులు, అధికారులు నాగరాజు,శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.