
– బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మే సత్యనారాయణ.
నవతెలంగాణ-కొత్తూరు : షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతున్న భాషను చూసి గ్రామాల్లో ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ అన్నారు. వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆయన కుమారులపై సిద్దాపూర్ బీఆర్ఎస్ నాయకుడు వడ్డే బాలయ్య పై చేసిన విమర్శలకు నిరసనగా ఎస్బి పల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండే కృష్ణ యాదవ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గౌరవనీయమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆయన కుమారులపై దిగజారి మాట్లాడుతున్నాడని చెప్పారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎన్నో ఏండ్లుగా రాజకీయ జీవితంలో ఉండి మచ్చలేని నాయకుడిగా వెలుగొందాడని చెప్పారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుటుంబం వ్యవసాయం చేసి పైకొచ్చిందని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ సిద్ధాపూర్ నాయకుడు బాలయ్య కుటుంబం కూడా వ్యవసాయ కుటుంబమేనని పేర్కొన్నారు. వీర్లపల్లి శంకర్ ఎక్కడ వ్యవసాయం చేసి సంపాదించాడో చెప్పాలని ఆయన ప్రశ్నించాడు. దమ్ముంటే గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వీర్లపల్లి శంకర్ అనవసరమైన మాటలు మాట్లాడకుండా తామేం చేస్తామో చెప్పాలని హితవు పలికారు. అంతకుముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వడ్డే బాలయ్య మాట్లాడుతూ… తాము రాజకీయాల్లోకి ఇచ్చి 10 ఎకరాల భూమి పోగొట్టుకున్నామని చెప్పారు. సొంత నిధులతో గ్రామంలో దేవాలయాలను నిర్మించామని అన్నారు. సిద్ధాపూర్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మండే కృష్ణ యాదవ్ సీనియర్ నాయకుడు పెంటనోళ్ల యాదగరి మాట్లాడుతూ… తమ నాయకులపై అనవసరంగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. స్థాయి దిగజారి మాట్లాడితే బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆయన భాష మార్చుకొని హుందాగా వ్యవహరించాలని వారు కోరారు. లేకపోతే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు . ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కడాల శ్రీశైలం, జంగయ్య యాదవ్ , సిద్దాపూర్ జంగయ్య , పిఎసిఎస్ డైరెక్టర్ అజయ్, గ్రామ అధ్యక్షుడు పాండు మహేష్, తదితరులు పాల్గొన్నారు.