– ఎస్సై గోపాల్ నాయక్, యాచారం కేంద్రంలో ప్రజలకు అవగాహన
నవతెలంగాణ-యాచారం
సైబర్ నేరాలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ గోపాల్ నాయక్ సూచించారు. బుధవారం యాచారం సెంటర్లో ప్రజలకు ఆయన పోలీస్ సిబ్బందితో కలిసి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్కు వచ్చే అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయకూడదన్నారు. అవాంచిత ఫోన్ కాల్స్, వ్యక్తిగత ఓటీపీలను ఇతరులకు షేర్ చేయకూడదని తెలిపారు. ఓటీపీలు చెప్పమని పదే పదే ఎవరైనా అడుగుతే చెప్పొద్దని చెప్పారు. ఒకవేళ ఓటీపీలు షేర్ చేస్తే బ్యాంకులో మీరు దాచుకున్న డబ్బులు, మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు కొట్టేస్తారని వివరించారు. ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. మనమందరం వాడుతున్న స్మార్ట్ ఫోన్లతో సైబర్ నెరగాళ్లు మాయ చేస్తారని గుర్తుచేశారు. ప్రజలంతా సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.