ప్ర’జల’దిగ్బంధం

Quarantine of peopleమిగ్‌జాం తుఫాన్‌ దెబ్బకు మూడు రాష్ట్రాలు చిగురు టాకులా వణికిపోతున్నాయి. కుంభవృష్టిగా కురిసిన వాన లకు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలు అతలాకుతలమ య్యాయి. వారం రోజులుగా సూర్యుడు కనిపించకుండా మ బ్బులు పట్టేయడం, ముసురు కమ్ముకోవడంతో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్తడిపోశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతినగా, పదుల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డి గాఢాంధకారం అలుముకుంది. చెన్నై విమానా శమ్రం సైతం నీటమునిగి విమానాలే రద్దయ్యాయి. ఏపీ లో చేపల వేటకెళ్లే పడవలు దెబ్బతినడంతో వేలాది మంది జీవనోపాధి ప్రశ్నార్ధకమైంది. తెలంగాణలోనూ పంటనష్టం తో రైతాంగం చితికిపోయింది. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఇంటి పైకప్పు కూలీ దంపతులు మృతి చెందారు. మిగతా చోట్ల సైతం పంటతో పాటు, జన నష్టమూ భారీగానే చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో తుఫాన్‌ తలెత్తవచ్చునని, అది ప్రచండరూపం దాల్చే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాఖ కిందటి నెలలోనే హెచ్చరించింది. అయినా, ప్రభు త్వాలు వాటిని ఖాతర్‌ చేయలేదు. ఆ ఫలితంగా, ముంచు కొచ్చిన ‘మిగ్‌జాం’ తుఫాన్‌ తీవ్రతకు మూడు రాష్ట్రాల జన జీవితాలు అతలాకుతలమయ్యాయి. బాపట్లకు సమీపంలో మంగళవావరం తీరం దాటిన ‘మిగ్‌జాం’ రైతాంగాన్ని నిలు వునా ముంచేసింది. కుండపోత వానలకు ఈదురుగాలులు తోడవ్వటంతో లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన వరిపంట నేల వాలిపోయింది. అది చూసి అప్పులు చేసి పస్తులుండి వేసిన పంటలు నీట మునగడంతో రైతుల కండ్లు చెరువులవు తున్నాయి. పెట్టిన పెట్టుబడులన్నీ గంగపాలు కావడంతో రేపు ఏమిటో అర్థంకాక ఆవేదనతో చేలను చూస్తూ కుప్ప కూలిపోతున్న పరిస్థితి. కోతలు పూర్తయ్యి కుప్పలు పోసిన ధాన్యమూ తడిచి ముద్దై మొలకలు రావడంతో మరెందరో అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వర్షాభావంతో పొలాలకు నీరందక ఖరీఫ్‌ మొదట్లో నానా అగచాట్లు పడి, కష్టనష్టాలకోర్చి కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను ఇప్పుడు మిగ్‌జాం మింగేసింది.
ఇండ్లన్ని జలమయమై బియ్యం, ఉప్పు పప్పులన్ని తడిసిపోయి జనం ఆకలితో అలమటించిపోతున్నారు. ఒక వైపు చలి, మరో వైపు వానలతో పసిపిల్లలు, వృద్ధుల బాధలు చెప్పనలవి కానివి. ప్రభుత్వాలు ఆగమేఘాల సహాయక చర్యలకు ఉపక్రమించకపోతే బాధితుల పరిస్థితి మరీ దయనీయమవుతుంది. పునరావాస కేంద్రాల్లో భోజనం, వసతి సదుపాయాలను పక్కాగా ఏర్పాటు చేయడంలో యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. గాఢాంధ కారంలో మునిగిపోయిన ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ, రహదారులపై రాకపోకలకు అవాంతరాల తొలగింపు వంటివీ చురుకందుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణకు తక్షణ ప్రాధాన్యమిచ్చి పని చేస్తే తప్ప, మురుగు నీటిపారుదల వ్వవస్థ బాగుపడదు. లేకపోతే అంటువ్యాధుల ముప్పు తప్పదు. మరల అదొక పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. నిస్సహాయ స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి అన్ని విధాలుగా అండగా నిలబడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. భీకరమైన తుఫాన్‌ దెబ్బకు విలవిల్లాడుతున్న రాష్ట్రాలకు కేంద్రమూ సాయం చేసి అండగా నిలబడాలి.
గత కొన్నేండ్లుగా అకాల వర్షాలు రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. పంట చేతికి వస్తుందని కండ్ల ల్లో ఒత్తులేసుకొని చూస్తున్న రైతుకు కడగండ్లే మిగులు తున్నాయి. భారీగా నష్టపోయిన రైతులకు ఆ బృందం ఈ బృందం సర్వేలతో ఎప్పుడో ప్రభుత్వాలిచ్చే అరకొర సాయం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో రైతు అనివార్యమై ఉరికొయ్యకు వేలాడుతున్న పరిస్థితి. కానీ, కేంద్ర ప్రభుత్వం నిన్నటికి నిన్న పార్లమెంటులో రైతు ఆత్మహత్యలు తగ్గాయి అంటుంది. నిజంగా తగ్గితే సంతోషమే. కానీ, అవి వాస్త వాలను తొక్కిపట్టేవి అయితేనే భవిష్యత్తుకు ప్రమాదం.
రోజురోజుకీ భూతాపం పెరగడంతో ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. మానవ తప్పిదాల వలన ప్రకృతి బాగుచేయ లేనంతగా ధ్వంసమైంది. భూతాపాన్ని కట్టడి చేసి విపత్తులు పెరగకుండా తగు చర్యలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాలను అమలు చేయడంలోనే పాల కులు విఫలమవుతున్నారు. ప్రమాదకరమైన విషజ్వరాలు, అంటువ్యాధులు, అనావృష్టి, అధిక వర్షాలు వంటి విపత్తులకు అంతు లేకుండా పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలే ప్రధాన కారణం. దీని నివారణ చర్యలు ఉపక్రమించకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని శాస్త్రవేత్తల హెచ్చ రికలను ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించు కోవాలి. అంతకంటే ముందుగా పెనువిపత్తు ధాటికి వెన్ను విరిగిన రైతన్నలను ఆదుకు నేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతి పదికన కదలాలి. పంటనష్టాలను వెంటనే లెక్కించి వీలైనంత వేగంగా పరిహారాలు చెల్లించి రైతులను ఆదుకోవాలి.