– కష్టజీవుల రక్తంతో ఏర్పడ్డదే ఎర్రజెండా
– పీడితప్రజల పోరాట గొంతుక గద్దర్ : కేసీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు
– ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ
నావతెలంగాణ- రామన్నపేట
కమ్యూనిస్టుల పోరాటాలు లేకుండా ప్రజలకు హక్కులు సాధించబడలేదని, ప్రతి సంస్కరణ కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సోమవారం గద్దర్ సంస్మరణ సభ, ఆటా-పాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రజెండా ఒకరు ఏర్పాటు చేసింది కాదని కష్టజీవుల రక్తంతో తడిచి ఏర్పడిందన్నారు. గద్దర్ పీడిత ప్రజల పోరాట గొంతుక అని అన్నారు. తెలుగు ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో గద్దర్‌ది అద్వితీయమైన పాత్ర అని తెలిపారు. ప్రజా సమస్యలను పాటగా మలిచి పాలకులకు వెన్నులో వనుకు పుట్టించిన ప్రజా గాయకుడు గద్దర్ అని చెప్పారు. సామ్రాజ్యవాద దోపిడిని, మతోన్మాదాన్ని, అంటరానితనాన్ని, ప్రజావ్యతిరేక విధానాలపై వేలాది పాటలు రాసి, పాడి ప్రజలను చైతన్యం చేశారన్నారు.
కళాప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల పక్షాన నిలవడమే గద్దర్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు.భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహోజ్వల పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని.. కానీ నేడు మతం పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బండెనక బండి కట్టి అంటూ దొరలు, జాగిర్ధార్లు, రజాకార్ సైన్యాలకు ఎదురొడ్డి నిలిచిన చరిత్రను మతం పేరుతో వక్రీకరించే బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మూఢవిశ్వాసాలను మరింతగా పెంచారని, కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలు, కష్టాలు మాట్లాడటం లేదని, వ్యక్తిగత దూషణలతోనే కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంటేపాక శివ కుమార్, ఈర్లపల్లి ముత్యాలు, నాయకులు దేశపాక రవి, కందుల హనుమంతు, మద్దూరి ఐలయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు నకిరేకంటి సురేష్, గంటేపాక శ్రీకాంత్, పండుగ రాజమల్లు పాల్గొన్నారు.