జి-20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రముఖ ఆర్థిక వ్యవస్థల గ్రూపు జి-20లో ఆఫ్రికన్‌ యూనియన్‌(ఏయు)కు శాశ్వత సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అంటే ఇకపైన జి-20 గ్రూపు జి-21గా మారిందన్నమాట. ఇందుకు సంబంధించిన ప్రకటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ జి-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించాడు. ఇంతకు ముందు యూరోపియన్‌ యూనియన్‌ కి మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉండేది. ఇప్పుడు యూరోపియన్‌ తోపాటు ఆఫ్రికన్‌ యూనియన్‌ కు కూడా జి-20లో శాశ్వత సభ్యత్వం లభించింది. ఆఫ్రికా యూనియన్‌ కు శాశ్వత సభ్యత్వం రాకమునుపు ఈ గ్రూపును ‘ఆహ్వానించబడిన అంతర్జాతీయ సంస్థ’ అని పిలిచేవారు.
‘అందరి ఆమోదంతో నేను ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులుగా తమ ఆసనాన్ని అధిష్టించవలసినదిగా కోరుతున్నాను’ అని భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రారంభ ఉపన్యాసంలో ప్రకటించాడు. ఆ తరువాత ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేత అజలి అస్సౌమని ప్రపంచ నాయకుల సరసన ఆశీనుడయ్యాడు. 1999లో ఉనికిలోకి వచ్చిన ఆఫ్రికన్‌ యూనియన్‌ లో 55ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. ఆఫ్రికన్‌ యూనియన్‌ యావత్‌ ఆఫ్రికా ఖండానికి ప్రాతినిధ్యంవహిస్తోంది. ఆఫ్రికన్‌ యూనియన్‌ లోని సభ్య దేశాలు సమిష్టిగా రాజకీయ, ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాయి. వలసవాద అవశేషాలను, వర్ణ వివక్షను అంతంచేయటమేకాకుండా సభ్యదేశాల మధ్య ఐక్యతను, సంఘీబావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆఫ్రికన్‌ యూనియన్‌ పనిచేస్తుంది. ఆఫ్రికా ఖండం నుంచి జి-20లో గతంలో ఒక్క దక్షిణ ఆఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉండేది.
జి-20గ్రూపులో ఆఫ్రికన్‌ యూనియన్‌ సభ్యత్వం తీసుకోవాలనే ఆలోచనను మొట్టమొదటిసారిగా సెనెగలీస్‌ అధ్యక్షుడు మాస్కీ సాల్‌ 2022 సెప్టెంబర్‌ లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో సమర్థించాడు. 140కోట్ల ఆఫ్రికన్లు ప్రభావితమయ్య నిర్ణయాల్లో అంతిమంగా ఆఫ్రికాకు ప్రాతినిధ్యం లభించనున్నదని ఆయన అన్నాడు.