శాంతియుత నిరసనలపై పెరూ పోలీసుల అణచివేత చర్యలు

లిమా : పెరూ కాంగ్రెస్‌ కొత్త డైరెక్టర్ల బోర్డు ఎన్నికకు వ్యతిరేకంగా శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై పెరూ పోలీసులు గురువారం దారుణంగా అణచివేత చర్యలు చేపట్టారు. బోర్డుకు ఎన్నికైన సభ్యుల్లో ఒకరు అవినీతి ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై 50కి పైగా పన్ను ఎగవేత ఆరోపణలు వున్నాయి. ఈ విషయమై లిమాలోని పార్లమెంట్‌ భవనం వెలుపల ఆందోళనకారులు కూర్చుని శాంతియుతంగా నిరసన తెలియచేస్తుండగా, పోలీసులు వచ్చి వారిపై దాడి చేశారు. అధ్యక్షురాలు దినా బొలూర్టె ఆదేశాల మేరకు భద్రతా బలగాలు 50మందికి పైగా కాల్చి చంపిన నేపథ్యంలో దానిపై న్యాయం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన సామాజిక సంస్థల ప్రతినిధి బృందాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. గతేడాది డిసెంబరులో అసెంబ్లీ జరిపిన కుట్రలో అప్పటి అధ్యక్షుడు పెడ్రో కేస్టిలో పదవి నుండి తొలగించబడి జైలు పాలవడంతో బొలూర్టె అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికీ పెరూ అధికారుల చెరలోనే కేస్టిలో వున్నారు. పెరూ అసెంబ్లీ నామినేట్‌ చేసిన తర్వాత 2023-24 సంవత్సరానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అలయన్స్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌ చట్టసభ్యుడు అలెజండ్రో సోటో ఎన్నికయ్యారు. అయితే అవినీతి ఆరోపణలపై సోటో దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు.