– 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) షెడ్యూల్‌ను గురువారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఈనెల 13న పీఈసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.500, ఇతరులు రూ.900 దరఖాస్తు ఫీజు కట్టాలని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణకు మే ఆరో తేదీ వరకు గడువుందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.500తో అదేనెల 15 వరకు, రూ.రెండు వేలతో 20 వరకు, రూ.ఐదు వేలతో 25వ తేదీ వరకు అవకాశముందని పేర్కొన్నారు. 26 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జూన్ ఒకటి నుంచి పదో తేదీ వరకు ఫిజికల్ టెస్టులను నిర్వహిస్తామని వివరించారు. అదేనెల మూడోవారంలో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, శాతవాహన వర్సిటీ వీసీ ఎస్ మల్లేష్, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ లక్ష్మికాంత్‌రాథోడ్, పీఈసెట్ కన్వీనర్ రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.