నవతెలంగాణ – కంటేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కి సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు పెండింగ్లో ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు,9, 10వ తరగతులకు సంబంధించి ఏడు నెలల గుడ్ల బిల్లులు, ఒకటి నుండి 8వ తరగతి వరకు రెండు నెలల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3000 రూపాయల గౌరవ వేతనం జీవో విడుదల చేసినప్పటికీ వాటిని చెల్లించడం లేదని అన్నారు, 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన వంట పాత్రలు పాడైపోయినప్పటికీ ఇప్పటికీ కొత్త వంట పాత్రలు ఇవ్వలేదని అన్నారు, సమస్యలు పరిష్కారం చెయ్యకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చామంతి లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, కోశాధికారి పర్వమ్మ, ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.