ఫొటో జర్నలిస్టు భరత్‌ భూషణ్‌ కుటుంబానికి డబుల్‌ రూమ్‌ ఇల్లు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సాహిత్యం, చిత్రకళ, ఫొటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, జీవిత కాలం కృషి చేసిన కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలనే నిర్ణయంలో భాగంగా ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, భరత్‌ భూషణ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు భరత్‌ భూషణ్‌ కుటుంబానికి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లోని జియా గూడలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లును శనివారం కేటాయించారు. భరత్‌ భూషణ్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా వైద్య ఖర్చుల కోసం సీఎం ఆరోగ్య నిధి నుంచి ప్రభుత్వం చేయూతనందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్‌ భూషణ్‌ భార్య సుభద్రమ్మ వారి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.