చిత్రపటం

అమ్మను చూసిన ప్రతిసారి
నవ్వుతున్న అగ్నిపర్వతాన్ని చూసినట్టుండేది

చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న అమ్మ
చూపులతో రహస్యంగా భూగోళమంతా
ప్రేమను గాలిస్తున్నట్టు అనిపించేది

తోడబుట్టిన మీసాలు ఏడాదికో ఆరుగజాలతో
చేతులు దులిపేసుకున్నా అమ్మ పెదవులు మాత్రం
ఆత్మీయమేఘాలై కురిసేవి

తాళికట్టిన వేళ్ళు అన్నంమెతుకులను విదిలించి
అమ్మ ఆశించిన చల్లనినీడను ఇవ్వలేకపోయేవి

అమ్మ సరదాల సంబరాలన్నీ మా కళ్ళలో దీపాలై వెలిగేవి
అమ్మ ఉత్సాహపు ఊపిరులన్నీ మా కాళ్ళలో
నాట్యమాడుతూ ఎగిరేవి

చిట్టచివరి క్షణాలలో మేము అమ్మకు అమ్మలమై
ఎనిమిది చేతుల ఓదార్పులయ్యాం
నాలుగు గొడుగులై నిలబడి నిశ్చింతగానే సాగనంపాం

ఈనాటికీ గుండెగోడలకు వేళ్ళాడదీసిన
అమ్మ చిత్రపటాన్ని చూసినప్పుడల్లా
సునామీలను కడుపులో పెట్టుకుని
దయాదీవెనల అలలతో మమ్మల్ని మదువుగా
పలకరించే సముద్రంలాగే అగుపిస్తుంది
– పద్మావతి రాంభక్త, 9966307777