పైడిమర్రి పేరు దేశవ్యాప్తంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

నవతెలంగాణ – హైదరాబాద్‌: జాతీయస్థాయిలో రాజ్యాంగసారాన్ని ప్రతిజ్ఞ రూపంలో
    పైడిమర్రి వేంకటసుబ్బారావు జీవిత చరిత్రను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదింపజేసి, పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. రాష్ట్ర అవతరణ వరకు “ప్రతిజ్ఞ ” ను రాసిన వ్యక్తి పైడిమర్రి వేంకటసుబ్బారావు అని లోకానికి తెలియదని గుర్తచేశారు.
నగరంలో నారాయణ గూడలోని జాహ్నవీ డిగ్రీ మరియు పీ.జీ కాలేజీలో శనివారం నాడు “ప్రతిజ్ఞ” రచయిత పైడిమర్రి వేంకటసుబ్బారావు జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల చేత పైడిమర్రి వేంకటసుబ్బారావు రాసిన ప్రతిజ్ఞ చదివించి, ప్రతిజ్ఞ చేయించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాతనే విస్మృత తెలంగాణ రచనలు వెలుగులోకి వచ్చి పాఠ్యాంశాలవుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015లో పాఠ్యపుస్తకాలలో “ప్రతిజ్ఞ” రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావును పేరును చేర్చడమే కాకుండా, 5వ తరగతి, 9వ తరగతి సిలబసులో పైడిమర్రి గురించి పాఠ్యాంశాలు పెట్టారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో పుట్టిన పైడిమర్రి దేశానికి “ప్రతిజ్ఞ” ప్రార్థనాగీతాన్ని అందించిన దేశభక్తుడు, గొప్ప రచయిత అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేనన్న మానవీయతత్త్వాన్ని “ప్రతిజ్ఞ ద్వారా దాటి చెప్పారన్నారు. దేశం పట్ల ప్రజల పట్ల సేవానిరతితో ఉండడం కోసం తన ప్రతిజ్ఞను భావితరాలకు అందించారని ఆయన గుర్తు చేశారు. ప్రజల మధ్య సహోదరభావాన్ని, ఐక్యతను ప్రతిష్ఠించిన పైడిమర్రి గీతరచయిత పేరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త పాశం యాదగిరి, జాహ్నవీ విద్యాసంస్థల చైర్మన్ ఏ. పరమేశ్వర్, కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ, వాసిరెడ్డి శివానందరావులు హాజరయ్యారు.