అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణపై హైకోర్టులో పిల్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌ భూముల చట్టంలో సవరణలు తీసుకొచ్చి వాటిని కొన్న వారికి యాజమాన్య హక్కు కల్పించే ప్రయత్నం చేస్తోందంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిని ప్రధాన న్యాయమూర్తి ఆలోక్‌ ఆరాదే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. అసైన్డ్‌ భూములు కొన్న వారికి మేలు జరిగేలా చట్ట సవరణ చేయడాన్ని అడ్డుకోవాలనీ, ప్రభుత్వ చర్య అమలును నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ రిపబ్లికన్‌ పార్టీ నేత ఆనంద్‌ వేసిన పిల్‌లో ప్రతివాదులకు నోటీసులిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఇతరులను ఆదేశించింది. విచారణను ఈ నెల చివరి వారానికి వాయిదా వేసింది. ప్రతివాదుల జాబితా నుంచి సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌లను చేర్చడానికి హైకోర్టు నిరాకరించింది.
మెడికల్‌ లోకల్‌ సీట్లపై ముగిసిన వాదన
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పెట్టిన మెడికల్‌ కాలేజీలో స్థానిక కోటా సీట్లు తెలంగాణ వారికే చెందేలా ప్రభుత్వం ఇచ్చిన జీవో 72ను సవాలు చేస్తూ దాఖలైన రిట్లపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరధే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. ఏపీ విద్యార్థులు వేసిన రిట్‌ను కొట్టేయాలని ప్రభుత్వం, కాళోజీ యూనివర్సిటీలు వాదించాయి. తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి ఉన్న కాలేజీ సీట్లల్లో 85 శాతం ఏపీ, తెలంగాణ విద్యార్థులు స్థానికులుగా పరిగణిస్తున్నట్లు చెప్పాయి.