న్యూఢిల్లీ : భారత్ పర్యటనలో ఉన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో సోమవారం ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వాణిజ్య, ఆర్థిక, రక్షణ రంగాలతోపాటు సాంస్కృతిక సహకారం వంటి ప్రధాన అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి మొదటి సమావేశానికి ఇరువురు నేతలు అధ్యక్షత వహించారు. 2019లో రియాద్‌లో భారత్, సౌదీ అరేబియాల మధ్య జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా భారత్‌ను అత్యంత సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటిగా భావిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రాంత, ప్రపంచ సంక్షేమం, స్థిరత్వం కోసం ఇరుదేశాల భాగస్వామ్యం కీలకమని అన్నారు. నేటి సమావేశం తమ బంధానికి కొత్త కోణాన్ని ఇచ్చిందని, మానవజాతి కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. సౌదీ యువరాజు సల్మాన్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి.