తెల్లారలేదా ఎల్లమ్మ….
ఈ గొర్లిడిసె వేళా అన్నను వెతుక్కుంటూ
మీ ఇంటికొచ్చాము
నీకేమో ఇవ్వాళ తెల్లారలేదేమో
నల్లని మబ్బులు కమ్ముకున్నట్టే వుంది కలకొండ ఆకాశం
ఎక్కడోళ్ళక్కడా కట్టేసినట్టే నిలబడ్డారు
ఎవరి కళ్ళలోకి చూసినా
దు:ఖం ఎర్రగా మసులుతుంది.
ఎవరి గొంతుకెళ్ళి చూసినా
ఎవరో ఎగేస్తున్నట్టు
దు:ఖం నిన్ను తలుసుకుంటూ రాగాల్ని తీస్తుంది
దు:ఖం దు:ఖం దు:ఖం
ఇంత దు:ఖపు వాకిట్లో నీకు తెల్లారట్లేదా ఎల్లమ్మ?
అన్నేమో నిప్పులమీద కుండలాగా
అతలాకుతలం అవుతున్నాడు.
నీకు వెండికడియాలు చేయిస్తానని
నీకు మాటీలు చేయిస్తానని
నిన్ను స్కూటి మీద ఎక్కించి తిప్పుతానని
నీకు సాటుంగ కల్లుపట్టుకొస్తానని
ఇంటికోచ్చేటోళ్ళనల్లా అమ్మను లేపమని
కన్నీళ్ళను ఒంపుతున్నాడు
కాళ్ళ కాడికి చాయి తెస్తవనే అమ్మా అని
నీ కాళ్ళ మీద తలపెట్టి అడుగుతుండు
అయినా నువ్వు సప్పుడుజేస్తాలేవెందుకమ్మ
గొప్ప కొడుకును కన్నవని
దేశమంతా సెప్పుకుంది
అమ్మలేని కొడుకు గొప్పోడైతడనే అమ్మ.
ఎల్లమ్మ
నీ బిడ్డ రోజు నువ్ మాకు వండిబెట్టే బువ్వ
ఇవ్వాళ నీకు అన్న వండుతుండే అని
బియ్యాన్ని గురిగిలోకి పోస్తుంటే
ఎక్కిళ్ళు బట్టి ఏడుస్తుంది.
అన్నను ఒంటరిచేసి ఎట్లా పొబుద్ది అయ్యిందే అని అరిచి మొత్తుకుంటుంది
ఎవరికెట్లా సమాధానం చెప్పుతావో
చెప్పు ఎల్లమ్మ.
ఇంటికి సుట్టమొస్తే మా గోపిగానికి
మొన్న ఇచ్చిన బాహుమతని
కప్పిన శాలువాను తెచ్చి చూపించి మురిసిపోయే
ఆ నవ్వుల్ని ఏ సీతఫలకచెట్టుకి కట్టిపోయావో
ఒక్కరికైనా చెప్పు తల్లీ..
చీరపైటనే నెత్తికి సుట్టబట్టి సుట్టి
కట్టెల మోపును లేపి ఎత్తుకొని నడుస్తావు
కలుపుతీయబోయి ఎత్తుకున్న బాధల్ని
మట్టికి చెప్పుకుంటావు
అల్లుడొస్తున్నాడనీ
కూరేడా దొరుకుద్దో జాడ పట్టి పండుగ పూట
ఊరంతా గాలిస్తుంటావు
ఉన్నంత కాలం కూలీ చేసి తెల్లటిపత్తిపువ్వై కనిపిస్తివి
నాయినలేని ఇంటికి నాయినవై
అడుగులేయిస్తివి కదా ఎల్లమ్మ
ఎవరెన్ని మాట్లాడినా.. అడిగినా కదలకుండా వింటున్నావు ఎందుకమ్మ.. మాట్లాడు.
నీ బలగం ఇంటి ముందు కన్నీటిపూల మాలై నిలబడ్డది.
దింపుడు కల్లం కాడా
ఎల్లమ్మ అన్నప్పుడైనా మాట్లాడకపోతివి
నీ మాటలు మాదాక అందట్లేదు కానీ ఎల్లమ్మ
అన్నను ఒంటరోన్ని అన్నందుకు క్షమించు
ఎక్కడెక్కడినుంచో పరుగెత్తుకొచ్చి
మీ ఇంటి ముందు వాలినవాళ్ళం
అన్నపక్కన ధైర్యపువాక్యాలమై
నిలబడే ఉంటాం
అన్న చేతిలో చెయ్యేసి ఆ మట్టిచేతుల్ని
నిలబెట్టుకుంటాం.
.
అమ్మ
పత్తి చేండ్లో నీ మీద మట్టికప్పినప్పటి నుండి
మరో విత్తనాన్ని పెట్టినట్టే వుంది.
– పేర్ల రాము
( తగుళ్ళ గోపాల్ అన్న అమ్మకోసం..)
అమ్మను కోల్పోయిన వాళ్ళు కొన్ని దినాల తర్వాత కన్నీళ్ళను అదుపులో పెట్టుకుంటారేమో కానీ గుండెంతా బరువెక్కి, కొంతకాలం మనసులో మనసుండదు. అమ్మను గురించి మాట్లాడాల్సిన ఈ సందర్భం ఎందుకొచ్చిందంటే కవి తగుళ్ళ గోపాల్ అమ్మ ఎల్లమ్మ కన్నుమూశారు. ఈ సందర్భంగా గోపాల్‌కు ధైర్యమిస్తూ, వాళ్ళ అమ్మకు నివాళులర్పిస్తూ కవులు కవిత్వం రాశారు. కవులిలా సాటి కవి బాధను పంచుకుంటున్నారంటే కవిత్వం ద్వారా నేర్చుకునే మానవీయతా పాఠం ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు.
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. ”అమ్మా అమ్మా నే పసివాన్నమ్మా, అమ్మను మించి దైవమున్నదా” ఇలాంటి పాటలను విన్నప్పుడల్లా మనసులో ఏదో తెలియని కలవరం.
ఉద్యోగరీత్యా, పిల్లల చదువుల కోసమని దూరంగా ఉంటున్నా వారానికో, రెండు వారాలకో అమ్మను కలుస్తూనే ఉంటాను. అయినా అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది. కొద్ది దూరంలో ఉంటున్నా నాకే ఇంత బాధగా ఉంటే శాశ్వతంగా అమ్మను కోల్పోయిన వారి బాధ ఎంతలా ఉంటుందో ఊహించగలను.
అమ్మను కోల్పోయిన వాళ్ళు కొన్ని దినాల తర్వాత కన్నీళ్ళను అదుపులో పెట్టుకుంటారేమో కానీ గుండెంతా బరువెక్కి, కొంతకాలం మనసులో మనసుండదు. అమ్మను గురించి మాట్లాడాల్సిన ఈ సందర్భం ఎందుకొచ్చిందంటే కవి తగుళ్ళ గోపాల్ అమ్మ ఎల్లమ్మ కన్నుమూశారు. ఈ సందర్భంగా గోపాల్‌కు ధైర్యమిస్తూ, వాళ్ళ అమ్మకు నివాళులర్పిస్తూ కవులు కవిత్వం రాశారు. లండ సాంబమూర్తి రాసిన ‘అమ్మలకు తెలియనిది’, మెట్టా నాగేశ్వరరావు ‘గోపాల్ మాఫ్ జేయరా’ అంటూ రాసిన కవిత, గోరటి రమేష్ రాసిన ‘అమ్మ నీ త్యాగం మరిచిపోనిది’ అంటూ మొదలెట్టిన కవిత, గూండ్ల వెంకట నారాయణ ‘ఎంత పిచ్చిదానివమ్మా’ అంటూ రాసిన కవిత, పేర్ల రాము రాసిన ‘తెల్లారలేదా ఎల్లమ్మ’ కవితలు ఈ సందర్భంలో రాసినవి. కవులిలా సాటి కవి బాధను పంచుకుంటున్నారంటే కవిత్వం ద్వారా నేర్చుకునే మానవీయతా పాఠం ఎంతగొప్పదో అర్థం చేసుకోవచ్చు.
పేర్ల రాము పరిణతి చెందిన కుర్రాడు. తన దారి పట్ల సరైన చూపు కలిగినవాడు. కవిత్వంలో జీవితాన్ని పేర్చుకుంటూ వస్తున్న ఉద్యమబాలుడు. ‘మనుషుల మధ్య’ అంటూ త్వరలో ఓ కవితాసంపుటితో మన ముందుకు రాబోతున్నాడు. దు:ఖం విలువ తెలిసినవాడు. వ్యవసాయ కుటుంబ నేపథ్యంలోంచి వచ్చిన వాడు. అప్పులతో అమ్మ, నాయన పడుతున్న కష్టాల సిలబస్‌ను అవపోసన బట్టిన వాడు. ఆ పిల్లోడు రాసిన ‘తెల్లారలేదా ఎల్లమ్మ’ కవిత ఎంతో మంది గుండెను మెలిపెట్టింది. కవితా పాదాల్లోకి కాసేపలా నడిచొద్దాం.
రాము ఈ కవితకు పెట్టిన శీర్షిక సహజంగా వచ్చింది. ఎంతగా తాదాత్మ్యం చెందితే ఆ శీర్షిక బయటికొస్తుంది? శీర్షికతోనే కవితాత్మను పట్టించాడు. హృదయమదన సంఘటనల్లోంచి పుట్టిన కవిత ఇది.
ఎత్తుకున్న ఆ మొదటి వాక్యం ఎంతో ఆర్ద్రతతో కూడి ఉంది. రాము జీవిత నేపథ్యం ఈ వాక్యం బయటికి రావడానికి కారణం. యాదవులు ఎక్కువగా గొర్లపెంపకం చేస్తుంటారు. పొద్దున్నే గొర్లను ఇడిసి మేతకని తీసుకెళ్తుంటరు. ఆ విషయాన్ని ముడిపెట్టి ‘తెల్లారలేదా ఎల్లమ్మ’ అంటూ మనసును కదిలించాడు. ఇంతటి బలమైన వాక్యం రావడానికి మరో కారణం గోపాల్, రాము ఒకే శ్రామిక కులనేపథ్యం నుండి రావటం కావచ్చు. ఒకే నేపథ్యానికి చెందకపోయిన కొన్ని సందర్భాల్లో కవి సామాజిక పరిశీలన దోహదపడవచ్చు. మొత్తంగా కవి ఈ కవితను ఎంతో సహజంగా ఎత్తుకున్నాడు. వస్తువులోకి అడుగులేస్తూ మనల్ని శ్రమలేకుండా నడిపించాడు. కవి చెప్పిన పోలికలు పల్లెజీవితంలో ఇమిడిపోయేలా ఉన్నాయి. ఎక్కడా కవితను పక్కదోవ పట్టించలేదు. వ్యక్తీకరణలో తనదైన శైలిని చూపించాడు.
1. నల్లని మబ్బులు కమ్ముకున్నట్టే ఉంది కలకొండ ఆకాశం
2. దు:ఖం ఎర్రగా మసులుతుంది
3. నవ్వుల్ని సీతాఫలకచెట్టుకు కట్టిపోవటం
కవితా నిర్వహణలో చనిపోయిన రోజుండే దు:ఖ స్థితిని పట్టుకొచ్చాడు. ఎల్లమ్మ కూతురు ఏడ్చిన సంఘటనలను, కొడుకు గోపాల్ అమ్మను గుర్తుచేసుకుంటూ ఏడ్చిన మాటలను మధ్యల స్టాంజాలలో చేర్చాడు. శుద్ధవచనం రాయకుండా కవిత్వమై సాగాడు. వస్తువు ఎంపిక కవిని ముందుకు తీసుకెళ్ళింది. ఈ వాక్యాలు పాఠకులను దు:ఖమయం చేసేవి.
”అన్నేమో నిప్పులమీద కుండలాగా/
అతలాకుతలం అవుతున్నాడు/
నీకు వెండికడియాలు చేయిస్తానని/
నీకు మాటీలు చేయిస్తానని/
నిన్ను స్కూటి మీద ఎక్కించి తిప్పుతానని/
నీకు సాటుంగ కల్లుపట్టుకొస్తానని/
ఇంటికోచ్చేటోళ్ళనల్లా అమ్మను లేపమని
కన్నీళ్ళను ఒంపుతున్నాడు”. తల్లితో ఉన్న అనుబంధాన్ని, తల్లికి మాటిచ్చి కొన్ని నెరవేర్చలేక పోయాననే బాధను గుర్తుచేసుకుంటున్న కొడుకు మాటలను కవి కవితా వాక్యాలుగా పేర్చాడు. ఇక్కడ కవిత్వం చేయటం కంటే వాక్యాలను ఉన్నవి ఉన్నట్టుగా రాయటమనేది కవితను నిలబెట్టింది. అన్ని సందర్భాల్లో కవిత్వం చేయటం పనికిరాదు. కొన్ని సహజంగా వ్యక్తీకరించే తత్వమున్న వాక్యాలకు కవిత్వం మినహాయింపు.
ఈ కవితలో ఇంకాస్త ముందుకెళ్తే ఎల్లమ్మ బతికున్నప్పుడు పడ్డ కష్టాలను కవి మాట్లాడాడు. పల్లెటూరి ప్రజల అనుబంధాన్ని గుర్తుచేశాడు. ఒక్కోసారి అనిపిస్తుంటది ఎంత మాయదారి కాలంలో ఉన్నామని. పాతకాలం రోజుల్లో బాటసారులు చీకటయ్యిందని ఓ చోట బండ్లు ఇడిసి ఎవరింటికన్న వెళ్తే అన్నం పెట్టి, వసతి ఇచ్చి ఎంతో బాగా చూసుకునేవారట. ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వటం కూడా కష్టంగానే ఉంది. కాలం మారింది. మనుషులు మారారు. ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో అర్థం కాకపోవటం ఇవాళ్టి పరిణామాలకు కారణం కావచ్చు.
ఎంతయినా పేదింటి ప్రేమలు వేరు. సుట్టమొస్తేనే పండుగ చేస్తారు. అల్లుడొస్తే ఎంత హడావిడి చేస్తరు.
”అల్లుడొస్తున్నాడనీ/
కూరేడా దొరుకుద్దోజాడ పట్టి/ పండుగ పూట/
ఊరంతా గాలిస్తుంటావు” అని కవి ఎల్లమ్మ ప్రేమానురాగాలను గుర్తుచేశాడు.
బంధువులెవరొచ్చినా కోన్ని కోయటం, కల్లో, ఇంత సారబొట్టో పోయడం ఈ ప్రాంతపు మర్యాద. చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటదని అలిశెట్టి చెప్పినట్టు అందరికీ రుచించక పోవచ్చు. ఎవరి అభిరుచులు వారివి. ఇంతలా దు:ఖాన్ని కవిత్వం చేస్తూ చనిపోయిన రోజు జరిగిన సంఘటనలను గతకాలపు స్మృతులతో ముడిపెట్టి ఏ ఒక్క విషయాన్నీ వదలకుండా ప్రతీ వాక్యాన్ని పలువరించి రాశాడు. కవిగా సాటి కవి మిత్రుని వెంటే ఉంటామని చెప్పటం కవిత్వం, జీవితం వేరు వేరు కాదని తెలియజేసే మూలసూత్రం. ప్రతీ వాక్యాన్ని నిర్మించే క్రమంలో కవి శ్రద్ధగా రాశాడనటం కంటే ‘తపించి’ రాశాడనటం సబబేమో.
ఇక కవితా ముగింపు వాక్యాలలో కవి ఎల్లమ్మ రూపంలో విత్తనాన్ని పాతి పెట్టాడు. కానీ, పాఠకుల గుండెల్లో అది మహావక్షమయి వేళ్ళూనుకొని ఉంది. విత్తనం నాటడమనే వాక్యాన్ని ఎందుకు రాసుంటాడు అని ఆలోచిస్తే… ఒక్కొక్కరికి ఒక్కో సమాధానం దొరుకుతుంది. ఒక ప్రేరణ కనిపిస్తుంది. భర్తలేకున్నా జీవితాన్ని ముందుకు నడిపించిన ఆమె శ్రమ జీవనం కనిపిస్తుంది. ఎంత మంది అమ్మలు విత్తనాలుగా నాటబెడితే ఇంతమంది కవులం పుట్టుకొచ్చాం మరి. అమ్మ లేదు కానీ అమ్మ తీపిగుర్తులు గోపాల్‌ను కవిత్వరూపంలో జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ కవితతో రాము ఇంకో మెట్టుకు చేరుకున్నాడు.
– తండా హరీష్, 8978439551