– పేరుకే మినీ ఇండియా.. అభివృద్ధి శూన్యం
– పటాన్‌చెరులో 900 భారీ, మధ్య తరహా పరిశ్రమలు
– పర్మినెంట్‌కు నోచని 60 శాతం కాంట్రాక్టు కార్మికులు
– కనీస వేతనాలు.. బోనస్, ఈఎస్‌ఐ దక్కని వైనం
– ప్రమాదాల్లో ప్రాణాలు పోయినా దిక్కేలేదు.. రోజంతా ట్రాఫిక్ తిప్పలు
– 3.80 లక్షల ఓటర్లలో లక్షన్నర మంది కార్మికులే..
– కార్మికుల మెడపై వేలాడుతున్న కేంద్రం తెచ్చిన లేబర్‌కోడ్లు
– గ్రేటర్‌కు ఆనుకుని ఉన్నా ఎన్నెన్నో సమస్యలు పట్టించుకోని పాలకులు..
– సీపీఐ(ఎం) పోటీతో తెరపైకి జనం డిమాండ్లు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పటాన్‌చెరు.. ఇదొక మినీ ఇండియా. పారిశ్రామిక ప్రాంతం. కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ‘కంపెనీలు వెదజల్లే కాలుష్యపు కుంపటి. అధ్వానమైన గుంతల రోడ్లు. సరైన రవాణా సదుపాయల్లేక ట్రాఫిక్ తిప్పలు. అందని ద్రాక్షలా విద్య, వైద్య సదుపాయాలు. పచ్చదనం లేక.. పార్కుల్లేక దుమ్మూధూళీ. వైద్యమందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు. పారిశ్రామిక వాడ ప్రాంతమైనా కనిపించని సాంకేతిక విద్యా సంస్థలు. శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు. అమలుకు నోచని 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాల జీవోల సవరణ, కార్మిక చట్టాలు.. బోనస్, పీఎఫ్, ఈఎస్‌ఐ. పర్మినెంట్‌కు నోచని 60 శాతం పైగా కాంట్రాక్టు కార్మికులు. దుర్భరంగా వలస కార్మికుల బతుకులు. ఇండ్లు, స్థలాల్లేక అద్దె ఇండ్లల్లో మగ్గుతున్న పేదలు. రోడ్డు, అగ్ని ప్రమాదాల్లో బుగ్గవుతున్న కార్మికుల బతుకులు’. ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత భాగం ఉన్నా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచలేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటాన్‌చెరు నియోజకవర్గంలోని సమస్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇక్కడ నుంచి గెలిచన గత నేతలు ప్రజలెదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. సీపీఐ(ఎం) పోటీ చేయడంతో ప్రజా సమస్యలు మరోసారి ఎన్నికల తెరపైకి వచ్చాయి.
నియోజకవర్గ ముఖచిత్రం..
పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల, జిన్నారం, అమీన్‌పూర్, రామచంద్రాపురం, పటాన్‌చెరు మండలాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు కార్పొరేషన్ డివిజన్లయిన తెల్లాపూర్, అమీన్‌పూర్, ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలతో విస్తరించింది. నియోజక వర్గంలో 3,80,948 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,96,357 మంది పురుషులు, 1,84,514 మంది మహిళా ఓటర్లున్నారు.
మొత్తం ఓటర్లలో కార్మికుల కుటుంబాల ఓట్లు 1.50 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పటాన్‌చెరు మీదుగా హైదరాబాద్-ముంబయి, హైదరాబాద్-నాందేడ్ రెండు ప్రధాన జాతీయ రహదారులు వెళ్తాయి. భారీ, మధ్య తరహా, చిన్న పరిశ్రమలకు నిలయంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీడీఎల్‌తో పాటు సుమారు 900 పరిశ్రమలున్నాయి.
పరిశ్రమలకు కేరాఫ్…
పటాన్‌చెరు నియోజకవర్గంలో బొల్లారం, బొంతపల్లి, ఖాజిపల్లి ఏరియాల్లో 400, పటాన్‌చెరు, పాశమైలారంలో 400 వరకు పరిశ్రమలున్నాయి. పెన్నార్, కిర్బీ, తోషిబా, శాండ్విక్, రెడ్డిల్యాబ్, అరవిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్, మైలాన్, హేటిరో డ్రగ్స్ వంటి అనేక పరిశ్రమలున్నాయి. నియోజకవర్గంలో రెండు లక్షల వరకు కార్మికులుండగా అందులో లక్ష వరకు కాంట్రాక్టు కార్మికులే ఉన్నారు. కార్మికుల హక్కులు, వేతనాలు, సామాజిక భద్రతకు తూట్లు పొడిచేలా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల ప్రభావం పటాన్‌చెరు ప్రాంతంపై తీవ్రంగా ఉంది. పదేండ్లుగా 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాల సవరణ జీవోలు అమలు కావడం లేదు. దాంతో లక్షలాది మంది కాంట్రాక్టు కార్మికులు పది, పన్నెండు వేల జీతాలకే పనిచేయాల్సి వస్తుంది. పెరుగుతున్న ధరల భారాలకు వస్తున్న జీతాలు చాలక పస్తులుండాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. సీఐటీయూ లాంటి ట్రేడ్ యూనియన్లు ఉన్న చోట్ల మినహా 90 శాతం పరిశ్రమల్లో కార్మికుల కనీస హక్కులు వర్తించడంలేదు.
వలస కార్మికుల నివాసాలు, స్లమ్స్ దుర్భరం
పటాన్‌చెరు అంటేనే వలస కార్మికులకు అడ్డా. చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, యూపీ, బీహార్, బెంగాల్, ఎపీ, కర్నాటక వంటి రాష్ట్రాల నుంచి వలసొచ్చి పనిచేస్తున్నారు.
నిర్మాణ రంగంలోనూ వలస కార్మికులు పెరిగారు. కంపెనీల ప్రాంతాల్లోనే నివాస గుడారాలేసి ఉంచుతున్నారు. కరెంట్, మంచినీళ్లు, డ్రైయినేజీ, వైద్యం, విద్య ఇవేవీ ఉండవు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్న కార్మికుల పిల్లలకు మాతృభాషలో చదువుకునేందుకు స్కూల్స్‌లేవు. పదేండ్లకు పైబడి ఉంటున్నా రేషన్‌కార్డులివ్వట్లేదు. ఆర్‌సీ పురం ముంబయి కాలనీ, ఫెన్సింగ్ ఏరియా, బొల్లారం, అమీన్‌పూర ఏరియాలో ఉన్న స్లమ్స్‌లో మౌలిక సదుపాయాల్లేవు. కొల్లూరులో కట్టిన 17 వేల ఇండ్లను స్థానికులకివ్వలేదన్న ఆరోపణలున్నాయి.
కాలుష్య కుంపటి.. ఊపిరాడని దుస్థితి
కంపెనీలు వెదజల్లే కాలుష్యంతో పాటు గుంతలమయమైన రోడ్ల మీద వచ్చే దుమ్ము ధూళీతో కాలుష్య కుంపటిగా మారింది. గుమ్మడిదల, జిన్నారం ఇతర ప్రాంతాల్లో కార్మికులు, ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కి అనారోగ్యాల పాలవుతున్నారు. పొగ కాలుష్యం, భూగర్భాల్లో వెదజల్లే కెమికల్ వ్యర్ధాలతో దుర్గంతపు వాసనతో కార్మికులు సహవాసం చేయాల్సి వస్తోంది. కంపెనీల భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయి. సీపీఐ(ఎం), సీఐటీయూ, స్వచ్చంద సంస్థలు కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చేశాయి.
అందని ద్రాక్ష విద్య, వైద్యం
ప్రజలకు విద్యా వైద్యం అందని ద్రాక్షలా మారాయి. వందలాది పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలున్నా సాంకేతిక విద్య పొందే అవకాశంలేదు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లేవు. పాత ఐటీఐల తప్ప ఆధునిక కోర్సులు బోధించే అదనపు ఐటీఐ కళాశాలు లేవు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ రంగంలో అవకాశాలున్నా ఆ కోర్సులు చదువుకునేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల్లేవు. పీహెచ్‌సీల్లో అరకొర వైద్య సేవలే అందుతున్నాయి. అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయి. ప్రతి మండల కేంద్రంలో 50 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రుల్ని నిర్మించాలని సీపీఐ(ఎం) పోరాడుతోంది,
ట్రాఫిక్ చిక్కులు
బీహెచ్‌ఈఎల్ నుంచి ఇస్నాపూర్ వరకు నిత్యం ట్రాఫిక్ రద్దీ తప్పట్లేదు. స్కూల్స్, డ్యూటీలకు వెళ్లేందుకు రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్‌లో చిక్కి.. గంటల తరబడి దుమ్ముధూళిలో ఇబ్బందులు పడుతున్నారు. రెండు జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలన్నీ పటాన్‌చెరు పట్టణం మీదుగానే వెళ్లాలి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. మియాపూర్-సంగారెడ్డి వరకు మెట్రోలైన్ విస్తరించాలని సీపీఐ(ఎం), ఇతర పార్టీలు ఎప్పటి నుంచో పోరాడుతు న్నాయి. రైల్వే లైన్ ఉన్నా పటాన్‌చెరు వరకు రైలు నడుస్తలేదు.
నేడు బీరంగూడ బహిరంగ సభకు బీవీ రాఘువులు రాక
సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లిఖార్జున్ గెలుపు కోసం ఆదివారం అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండి మార్కెట్‌లో నిర్వహించే బహిరంగ సభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ నియోజవకర్గ సమగ్రాభివృద్ధిపై మ్యానిఫెస్టో విడుదల చేసి మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాల అమలుకు కృషి చేస్తానన్నారు. పారిశ్రామిక వాడల్లో సంక్షేమ భవనం నిర్మాణం, అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతానని తెలిపారు. పాశమైలారం, జిన్నారం, బొంతపల్లి, ఖాజీపల్లి, ఆర్సీపురం, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక గృహ సముదాయం ఏర్పాటుకు కృషి చేస్తామని, కార్మిక వాడల్లో బస్తీల్లో పీహెచ్‌సీలు, ఆర్సీపుర్ ఈఎస్‌ఐ ఆస్సత్రిని వెయ్యి పడకలకు పెంచి అభివృద్ధి చేస్తానన్నారు. సంగారెడ్డి వరకు మెట్రోలైన్ విస్తరణ, ఎంఎంటీఎస్ పటాన్‌చెరు వరకు పొడిగింపుకు కృషి చేస్తానన్నారు.
రోడ్డు, అగ్ని ప్రమాదాలు
రోడ్డు, అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. కెమికల్, ఫార్మా కంపెనీల్లో బాయిలర్లు పేలి మంటలు చెలరేగుతున్నాయి. పాశమైలారం, బొంతపల్లి, ఖాజిపల్లి, బొల్లారం, గుమ్మడిదల, పటాన్‌చెరు ప్రాంతాల్లో వందల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది కాలంలోనే 10 మంది వరకు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాలపాలయ్యారు. అనుమతులు ఇచ్చే సమయంలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం, యాజమాన్యాల తప్పిదాలకు కార్మికులు బలవుతున్నారు. సీఐటీయూ జోక్యం చేసుకున్న చోట పరిహారం ఇప్పిస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎతైన క్రేన్లపై పనిచేస్తూ జారీ పడి ప్రమాదాలకు గురవుతున్నారు.