– కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానం
– పరస్పరం సన్మానించుకున్న నేతలు
– బీఆర్‌ఎస్, కేసీఆర్ తీరుపై పొంగులేటి ఆగ్రహం
– కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయమన్న తుమ్మల
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆహ్వానించారు. ఖమ్మం గొల్లగూడెం రోడ్డులోని తుమ్మల ఇంటికి శనివారం ఉదయం పొంగులేటి వెళ్లారు. తుమ్మల ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తుమ్మలకు పొంగులేటి పూలమొక్క ఇచ్చి, శాలువా కప్పారు. పొంగులేటిని కూడా శాలువాతో మాజీ మంత్రి సన్మానించారు. తుమ్మల అనుచరులను పొంగులేటికి, పొంగులేటి అనుచరులను తుమ్మలకు పరస్పరం పరిచయం చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యేకంగా ఓ గదిలో కూర్చొని అరగంటకు పైగా చర్చించుకున్నాక బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
వినాశకాలే విపరీత బుద్ధి : పొంగులేటి
‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ‘ఖమ్మం జిల్లా కాంగ్రెస్, ప్రజల పక్షాన తుమ్మలను ఆహ్వానించాం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం మినహా మిగిలిన చోట్ల ఒకటి, రెండు శాతం ఓట్లు కూడా లేని టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు తుమ్మలను పార్టీలోకి తీసుకున్న కేసీఆర్, ఆ తర్వాత ఉప ఎన్నికల కోసం తనను, ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజరుకుమార్‌ను పార్టీలోకి రప్పించారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో ఆ పార్టీ, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. పార్టీలో చేరాక కొన్ని శక్తులు వారికి ఇష్టం లేకుంటే ‘పొమ్మన లేక పొగబెట్టే’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ పార్టీలో చేరాక అనేక అవమానాలకు గురిచేస్తూ ముందు నన్ను బయటకు పంపారు. ఆ తర్వాత తుమ్మలను.. మేమైతే మిమ్మల్ని సస్పెండ్ చేయం.. మీ అంతట మీరు పోయేవిధంగా చేస్తామనే రీతిలో వ్యవహరించిన పద్ధతులను అందరూ ప్రత్యక్షంగా చూశారు. తుమ్మలతోపాటు వారి మిత్రబృందాన్నీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం పట్ల తెలంగాణ ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో రాబోయే ఎన్నికల్లో చూడబోతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటాం.. పెద్దలు తుమ్మల, ఇంకా చాలా మంది ఉన్నారు. మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. బీఆర్‌ఎస్‌ను వీడాక అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన తర్వాత వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నా.. తుమ్మల కూడా అదే పద్ధతిలో నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రజాకోరిక మేరకు నిర్ణయం ఉంటుందని తుమ్మల చెప్పారు. ఇంకా కొంత సమయం పడుతుంది.. తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని” తుమ్మల అన్నట్టు పొంగులేటి వివరించారు.
కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం: తుమ్మల నాగేశ్వరరావు
కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ‘నన్ను ఆహ్వానించడానికి వచ్చిన పొంగులేటికి ధన్యవాదాలు. నా రాజకీయ జీవితం.. నా కోసం, నా కుటుంబం.. నా స్వార్థం కోసం కాకుండా నాకు వచ్చిన ఏ అవకాశమైనా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడ్డా. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను, నేనున్న పార్టీలతోపాటు జిల్లా అభివృద్ధికి కృషి చేశా. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా.. కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందని’ వివరించారు.
నాలుగేండ్ల తర్వాత..
జిల్లా రాజకీయాల్లో కీలక నేతలుగా భావిస్తున్న తుమ్మల, పొంగులేటి దాదాపు నాలుగేండ్ల తర్వాత ఒకర్నొకరు ప్రత్యక్షంగా కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురి నేతల ఆత్మీయ ఆలింగనంపై అనుచరుల మధ్య సరదా చర్చ సాగింది. పొంగులేటి అనుచరులు చావా శివరామకృష్ణ, మువ్వా విజరుబాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మలీద్ జగన్, దొడ్డా నగేష్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, తుమ్మల అనుచరులు సాధు రమేష్‌రెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బండి జగదీశ్, మద్ది ఎల్లారెడ్డి, బాణోత్ కృష్ణ తదితరులు సరదా సంభాషణ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలుచుకుంటామనే విశ్వాసాన్ని వెల్లడించారు.