– ఇలాగైతే దేశంలో ఆకలికేకలే : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కంపెనీలకు సరఫరా చేయడం దారుణమని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. ఇలాగైతే దేశంలో ఆకలికేకలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పొట్టగొట్టి కార్పొరేట్ సంస్థలకు బియ్యాన్ని కట్టబెట్టాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాలు క్వింటాలుకు రూ. 3400 చెల్లిస్తామన్నా కేటాయింపులు చేయని కేంద్రం ఇథనాల్ తయారీ కోసం క్వింటాల్ బియ్యాన్ని రూ.2వేలకే బియ్యాన్ని సరఫరా చేయడమేంటని ప్రశ్నించారు. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం కింద ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాలకు కేటాయించబోమని చెప్పడం కేంద్రం నియ ంత పోకడలకు నిదర్శనమని విమర్శించారు. సబ్సిడీ పథకాలకు మంగళం పాడే దిశగా కేంద్రం కుయుక్తులు పన్నుతుందని ఆరోపించారు. పీడీఎస్‌ను క్రమంగా వదిలించుకోవడానికే ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్ళను క్రమంగా తగ్గించిందని తెలిపారు. రాష్ట్రాలకు అవసరమైన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనడం బీజేపీ బాధ్యతరహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.