– మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం
– కాలువల్లో దిగి నిరసన వ్యక్తం చేసిన జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని, మురుగు కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయని, ప్రజలు అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద మురుగు కాలువను ఆయన పరిశీలించారు. చెత్తాచెదారంతో నిండిన కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. పట్టణంలోని గాంధీనగర్, సీతారాంపురం, షాబునగర్, ముత్తిరెడ్డి కుంట హనుమాన్‌పేట మురికి కాలవల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందన్నారు. జనావాసాల్లోని కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. వర్షం వచ్చినప్పుడల్లా కాలువలో నీరు నిల్వ ఉంటుందన్నారు. ఎన్నికలపై దృష్టి తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. తక్షణమే మురికి కాలువల్లో చెత్తను తొలగించాలని, మురుగు నీరు సక్రమంగా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రెమిడాల పరుశురాములు, ఎండీ.అంజాద్ పాల్గొన్నారు.