నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28 నుంచి పోస్ట్‌కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టు టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్ కత్తుల యాదయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్ల నుంచి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు పోస్టుకార్డులు పంపుతామని తెలిపారు. ఈ మేరకు నమూనా లేఖను విడుదల చేశారు. దానిలో వారికి రావల్సిన రెండు వేతన సవరణలు వెంటనే చేయాలనీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలనీ, సంస్థలో వెల్ఫేర్ బోర్డులు రద్దు చేసి కార్మిక సంఘ కార్యకలాపాలను అనుమతించాలని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆర్టీసి యాజమాన్యం సీసీఎస్ డబ్బులు చెల్లించాలనీ, 2021లో విడుదల చేసిన మార్గదర్శకాలను సవరించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ కోరారు. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం ఈక్విటీగా మార్చి, రాష్ట్రబడ్జెట్‌లో రెండు శాతం నిధులు కేటాయించాలని తెలిపారు. 2013 జూన్ నాటి వేతన ఒప్పంద పాత బకాయిల బాండ్స్ డబ్బులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు రాసి పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.