నువ్వు కరెంటు వైర్లు పట్టుకో అంటే లేదు లేదు నువ్వే కరెంటు వైర్లు పట్టుకో అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఇక ఎలాంటి ప్రజా సమస్యలు లేనట్టు దీనిచుట్టూనే రాజకీయాన్ని తిప్పుతున్నారు. దానికోసం రోడ్ల మీదికొచ్చి పోటాపోటీగా ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఇలాంటి మాటల తూటాలే పేలాయి. ఉనికిలో లేని బీజేపీని బూచిగా చూపి, ఆపార్టీకి ఎక్కడ లేని క్రేజ్‌ను బీఆర్‌ఎస్ పార్టీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విమర్శ, ప్రతివిమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరింత వేగంగా జనంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంది. అంతిమంగా ఈ మూడు పార్టీలు ఇప్పటి నుంచే ఎలక్షన్ ఫీవర్‌లోకి వెళ్లిపోయి, జనం సమస్యల్ని గాలికొదిలేయడం గమనార్హం!
కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దే
మూడు గంటల కరెంట్‌పై గ్రామాల్లో చర్చించాలి
–17 నుంచి రైతువేదికల వద్దే సమావేశాలు :మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కాంగ్రెస్‌కు మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దే. రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న ఆ పార్టీ విధానంపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలి.ఇదే అంశాన్ని విస్తతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఈనెల17 నుంచి పది రోజులపాటు రైతు వేదికల వద్ద సమావేశాలు నిర్వహించాలి. కాంగ్రెస్ కరెంటు కుట్రలపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఎకరానికి గంట విద్యుత్తుచాలన్న కాంగ్రెస్ నేతల మాటలు రైతులను అవమానించడమే. రైతులను అవమానించిన ఆపార్టీ రైతాంగానికి క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలి. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్‌ఎస్ కావాలా? తెలంగాణ రైతులు తేెల్చుకోవాలని చెప్పాలి’ అంటూ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ రైతులకు సూచించారు. బీఆర్‌ఎస్ శ్రేణులతో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ విషయంలో ఆ పార్టీ తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకున్నదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 95 శాతం మంది రైతన్నలకు మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని, ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకువెళ్లాలని
కోరారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను ప్రజాబాహుళ్యంలోకి మరింతగా తీసుకువెళ్లేందుకు, ‘బీఆర్‌ఎస్ పార్టీ మూడు పంటలు కావాలా?, కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా’ అనే నినాదంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కుట్రల గురించి ప్రతి గ్రామంలో, ప్రతి రైతు ఇంట్లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగ అభివద్ధి కోసం తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందని తెలిపారు. రైతుల పట్ల వ్యవసాయ రంగం పట్ల గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు అనుచితమంటూ మాట్లాడిందన్నారు. 2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్, ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంద్రబాబు శిష్యుడే అని, అందుకే రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఉచిత విద్యుత్తుపైన అడ్డగోలుగా మాట్లాడారని వివరించారు. అందుకే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలని సూచించారు. రేవంత్ వ్యాఖ్యలు రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని, అందుకే తెలంగాణ రైతన్నలు కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ పార్టీ కుట్రల గురించి ఈనెల 17 నుంచి పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి రైతు వేదిక వద్ద కనీసం వెయ్యి మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను స్వయంగా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాలు చేయాలన్నారు. ఒక ఎకరానికి ఒక గంట విద్యుత్ సరిపోతుందంటూ, 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానించడమేనని, అందుకే కాంగ్రెస్ పార్టీ వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాల్లో తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా సమావేశాల్లో కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను, భారత రాష్ట్ర సమితి పాలనలో అందుతున్న కరెంటు పరిస్థితులను రైతులకు వివరించాలన్నారు.
24 గంటల విద్యుత్ ఇచ్చిన సబ్‌స్టేషన్ల పరిధిలో
మేం ఓట్లడగం
– ఇవ్వని సబ్ స్టేషన్ల పరిధిలో బీఆర్‌ఎస్ ఓట్లు అడగొద్దు
– వెలుగులు నింపింది నిజమైతే, కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేయాలి
– బీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకే సీట్లు ఇవ్వాలి : రేవంత్‌రెడ్డి సవాల్‘మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నట్టు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఆ సబ్‌స్టేషన్‌ల పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదు. 24 గంటల కరెంట్ ఇవ్వని సబ్‌స్టేషన్‌ల పరిధిలో బీఆర్‌ఎస్ ఓట్లు అడగొద్దు. దీనికి బీఆర్‌ఎస్ సిద్ధమా? ఈ విషయంలో ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి సబ్‌స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాం, రచ్చబండ నిర్వహిద్దాం. రైతులతో చర్చ పెడదాం.రండి చర్చకు సిద్ధంగా ఉన్నాం అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ మా సవాలుకు సిద్ధమైతే, తెలంగాణ రాష్ట్రంలో 3500 సబ్ స్టేషన్లు ఉన్నాయనీ, అక్కడే తేల్చుకుందాం రావాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, మల్లు రవి, చిన్నారెడ్డి, సంపత్, హర్కర వేణుగోపాల్, ప్రీతమ్, రోహిన్‌రెడ్డితో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని పునరుద్ఘాటించారు. శాసనమండలి చైర్మెన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు పునరుద్ఘాటించారు. శాసనమండలి చైర్మెన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి గంగుల కమలాకర్ తదితరులు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. వారి వాదనలో పస లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాగ్ బుక్‌లు చూపించి 24గంటల కరెంటు రావడం లేదని నిరూపించారని గుర్తు చేశారు.
విద్యుత్ ఫైల్స్ విడుదల చేస్తాం
విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలపై త్వరలోనే విద్యుత్ ఫైల్స్ విడుదల చేస్తామని రేవంత్ హెచ్చరించారు. తాను 20 ఏండ్లుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడుతున్నానని తెలిపారు. టీడీపీలో చేరినప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతిపక్షంలోనే ఉండి ఆత్మగౌరవంతో ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర నాది అని వ్యాఖ్యానించారు. చత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్ ఉన్నా అక్కడ 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదన్న బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్ పుట్టిన చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎందుకు ప్రకటించలేదు. ఇదే విషయాన్ని కొండారెడ్డిపల్లికి ఎందుకు వర్తింపచేయ లేదు. రాష్ట్రాలను బట్టి ప్రాధాన్యతలు మారుతుంటాయి. ఈ విషయం కూడా తెలియని మూర్ఖులు అని ఎద్దేవా చేశారు.
1999 కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ
వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని పెట్టామని గుర్తుచేశారు. అప్పుడు అధికారంలోకి రాలేదు కాబట్టి ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయామని తెలి పారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ విద్యుత్ చార్జీలను పెంచింద న్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడారని గుర్తు చేశారు. ఆ ఉద్యమంలో 25 వేల మంది రైతుల మీద క్రిమినల్ కేసు లు పెట్టారనీ, ఆ ఉద్యమం సందర్భంగా చేపట్టిన ‘ఛలోఅసెంబ్లీ’ కార్యక్రమం పై బషీర్‌బాగ్ వద్ద కాల్పులు జరిపితే ముగ్గురు రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ పార్టీ ఆలోచన చేయక ముందే కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్ అందించిందని తెలిపారు. మంత్రి పదవి కోసం ఆనాడు కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోసెందుకు సిద్ధమైంది నిజం కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిది నెలలైనా చంద్రబాబు కేసీఆర్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనీ, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వ రావు, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, వేమూరి రాధాకష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇందుకు ప్రత్యక్ష సాక్షులు అని వ్యాఖ్యానించారు. బొజ్జల ఇచ్చిన కోటి రూపాయాలతో ఆనాడు కేసీఆర్ టీఆర్‌ఎస్ పెట్టారని ఆరోపించారు.
కామారెడ్డి వైపు ఎందుకు చూస్తున్నారు?
‘బీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు తొమ్మిదేండ్లుగా పాలిస్తున్నారు. చెప్పిన వాటికంటే ఎక్కువ చేశామని వ్యాఖ్యానిస్తుంటారు. అదే నిజమైతే ఇప్పుడు 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. కేసీఆర్‌కు చీము నెత్తురుంటే తిరిగి గజ్వేల్ నుంచే పోటీ చేయాలి. లేకుంటే కేసీఆర్ మాడ అని ఒప్పుకోవాలి’ అని కోరారు. సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్‌లో ఓడిపోతా రని సర్వేల్లో తేలిందనీ, అందుకే కామారెడ్డిలో సర్వే చేయించుకుంటున్నా రని విమర్శించారు. ఇప్పుడున్న సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తానంటూ కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదు? అని ప్రశ్నించారు.
పోచారం, గుత్తాకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు
‘బీఆర్‌ఎస్ సర్కారు 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 9 గంటల ఉచిత కరెంట్‌నే 2018 వరకు విడతల వారిగా ఇచ్చారు. బీఆర్‌ఎస్ 2018 మేనిఫెస్టోలో సింగరేణి బొగ్గు గనుల దగ్గర విద్యుత్ ప్లాంట్‌లు పెట్టాలని పొందుపరిచారు. కానీ ఎలాంటి బొగ్గు గనులు లేని యాదాద్రికి పవర్ ప్లాంట్ తరలించారు. అత్యంత అవినీతిపరులే కేసీఆర్ సలహాదారులుగా ఉన్నారు. మంత్రులు ఏ పార్టీలో నుంచి వచ్చారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీశ్‌కు సిగ్గుండాలి’ అని విమర్శించారు. ‘స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మెన్‌కు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. పదవుల్లో ఉన్న గుత్తా, పోచారం రాజకీ యాలకతీతంగా ఉండాలి. కానీ ప్రత్యక్ష రాజకీయ నాయకుల మాదిరిగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ బూట్లు నాకుతు న్నారు. పోచారం కొడుకులు కంకర నుంచి ఇసుక వ్యాపారం దాకా చేయని దందా లేదు. తన కొడుకుల కోసమే పోచారం దిగజారి ప్రవరిస్తున్నారు. పంచాయతీకి కూడా పనికిరాని గుత్తా సుఖేందర్‌రెడ్డిని రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీని చేసింది. మంత్రి పదవి మీద ఆశతో గుత్తా బీఆర్‌ఎస్‌లో చేరిండు. ఇప్పుడు గుత్తా తన కొడుకును నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించేందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. నల్లగొండలో గుత్తాను కోమటిరెడ్డి బండకేసి కొట్టిండు. పోచారం, గుత్తాలను రైతు కులం నుంచి బహిష్కరించాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వారు రాజకీ యాలు మాట్లాడుతున్నారు. పార్టీలకు ద్రోహం చేశారు. నమ్మిన నాయకు లను మోసం చేశారు. ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నారు. కొడుకుల కోసం ఇంతగా దిగజారుతారా? వారిని గవర్నర్ వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలి’ అని ఘాటుగా విమర్శించారు.