అమర వీరుల స్మారకంలోనూ బీఆర్‌ఎస్‌ అవినీతి

– నిర్మాణంలో నాణ్యతా లోపాలు
– శిలాఫలకంపై అమరుల పేర్లు లేకపోవడం దారుణం : రేవంత్‌రెడ్డి
– కేఏ పాల్‌లా మాట్లాడుతున్న బండి సంజయ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అమర వీరుల స్మారకంలోనూ బీఆర్‌ఎస్‌ అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిర్మాణంలోనూ నాణ్యతా లోపాలు ఉన్నాయని చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అమరవీరుల స్మారక నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచారని తెలిపారు. అందులో మంత్రి కేటీఆర్‌ పాత్ర ఉందని ఆరోపించారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తుకురావాలన్నారు. కానీ అమరుల త్యాగాలను రాజకీయ స్వార్థానికి సీఎం కేసీఆర్‌ ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్టు వ్యవహరిస్తున్నారనీ, అమరుల బలిదానాల ను కేసీఆర్‌ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. త్యాగాలు చేసిన వారిని అవమానించేలా బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నదని తెలిపారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి 2017, జూన్‌ 17న ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. డిజైన్‌, అంచనాల కోసం, పనులను పరిశీలించేం దుకు ఆరు శాతం ఫీజు చెల్లించాలని నిర్ణయించారని తెలిపారు. 2018, జూన్‌ 28న నిర్మాణం కోసం రూ. 64 కోట్ల వ్యయంతో టెండర్‌ ప్రకటన చేశారని వివరించారు. ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసిందని పేర్కొన్నారు. కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకుందనీ, ఆ కంపెనీ కేటీఆర్‌తో కలిసిన తర్వాత కేపీసీ ప్రాజెక్ట్సు లిమిటెడ్‌గా మారిందన్నారు. ఆ కంపెనీ ప్రొద్దుటూరు, కడప జిల్లాకు చెందిన వ్యక్తులదనీ, కేపీసీ కంపెనీ అడ్రెస్‌ విజయవాడకు మారిందన్నారు. కేపీసీ ప్రాజెక్స్ట్‌ అనిల్‌ కుమార్‌ కామిశెట్టితో వ్యూహాత్మకంగా తేలుకుంట్ల శ్రీధర్‌ కేటీఆర్‌కు మేలు జరిగేలా చేశారన్నారు. దీంతో నిర్మాణ అంచనా వ్యయం రూ. 127 కోట్ల నుంచి అంచెలంచెలుగా రూ. 179 కోట్లకు పెరిగిందన్నా రు. ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని మాత్రమే రాసి సరిపెట్టడం సరికాదని రేవంత్‌ అన్నారు. శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్‌ పేరు ఎందుకు పెట్టాలి అని ప్రశ్నించారు. చరిత్రను మలినం చేసేందుకే కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారనీ, దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలన్నారు. వందలాది మంది వీరుల త్యాగాలను కేసీఆర్‌ కాలగర్భంలో కలిపేశారన్నారు. శ్రీకాంతాచారి, ఇషాన్‌ రెడ్డి, కానిస్టేబుల్‌ కిష్టయ్య… వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలన్నారు. పవిత్రమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని విమర్శించారు. పది ఎకరాల్లో నిర్మించిన ప్రగతి భవన్‌ పనులను తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే…. అమరవీరుల స్థూపాన్ని నిర్మించడానికి తొమ్మిదేండ్లు పడుతుందా…? అని అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయా రని తాము ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆ నెంబర్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదా? అని ప్రశ్నించారు. తొలి, మలి ఉద్యమాల్లో 1569 మంది అమరులయ్యారని కేసీఆర్‌ నిండు సభలో (2014, జూన్‌ 14న) చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు ప్రభుత్వ తీర్మానాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాయని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 1,569 మంది అమరుల పేర్లు శిలాశాసనంలో పొందుపరుస్తామనీ, ఆ వివరాలు చదివాకే అమరుల స్మారక స్థూపం దగ్గరికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని వ్యాఖ్యానించారు. హజ్‌ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్‌ అలీని గహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు కేఏ పాల్‌ లాగే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని చెప్పారు.