విశ్రాంతి మోడ్‌ లోకి ప్రజ్ఞాన్‌ రోవర్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చంద్రయాన్‌ 3 లో భాగంగా చంద్రునిపై 14 రోజుల పాటు తన యాత్రను కొనసాగించి న ప్రజ్ఞాన్‌ రోవర్‌ ఆదివారం నుంచి ‘విశ్రాంతి’ తీసుకోనుంది. చంద్రుని పగటి పూట ముగియడంతో మరో 14 రోజుల పాటు రాత్రి వేళ కొనసాగనుంది. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు తమకు అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వర్తించినట్టు ఇస్రో పేర్కొంది. సల్ఫర్‌, ఐరన్‌, ఆక్సిజన్‌ మూలకాలను కనుగొనడంతో పాటు సాపేక్ష ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేశాయి. ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పనిని పూర్తి చేయడంతో సురక్షితంగా పార్కు చేసి, ‘స్లీప్‌’ మోడ్‌లోకి పంపినట్టు ఇస్రో ట్వీటర్‌ లో పేర్కొంది. ప్రస్తుతం బ్యాటరీ పూర్తిగా చార్జింగ్‌లో ఉందని, సెప్టెంబర్‌ 22న మరలా సూర్యోదయం ప్రారంభమైన తరువాత కాంతిని స్వీకరించే విధంగా సోలార్‌ ప్యానెల్‌ ను సన్నద్ధం చేసినట్లు తెలిపింది. మరొక సారి తనకు అప్పగించే లక్ష్యాలను నెరవేర్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రునిపై భారత రాయబారిగా అక్కడే ఉండిపోనుందని వెల్లడించింది.