– ప్రపంచకప్ చెస్ ఫైనల్
– నేటినుంచి టై బ్రేక్ పోటీలు
బాకు: ప్రపంచకప్ చెస్ ఫైనల్లో 18ఏళ్ల రమేశ్‌బాబు ప్రజ్ఞానంద రెండోరౌండ్‌లోనూ టాప్‌సీడ్ మాగస్ కార్ల్‌సన్‌ను నిలువరించాడు. బుధవారం భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద, నార్వేకు చెందిన మాగస్ కార్ల్‌సన్‌ల మధ్య జరిగిన ఫిడే ప్రపంచకప్ చెస్ ఫైనల్ రెండోరౌండ్ పోటీ 30ఎత్తుల అనంతరం డ్రాకు ఇరువురు అంగీకరించారు. క్లార్‌సన్ తెల్లపావులతో, ప్రజ్ఞానంద నల్లపావులతో నేటి గేమ్‌లను ఆడారు. గురువారం నిర్వహించే టైబ్రేక్ పోటీలు జరగనున్నాయి. ఇక మంగళవారం జరిగిన తొలి గేమ్ డ్రా కావడంతో ఇరువురు 1-1పాయింట్లతో సమంగా నిలిచారు.
నేటినుంచి టైబ్రేక్ పోటీలు..
తొలి రెండు గేమ్‌లు డ్రా కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందకు టైబ్రేక్(ర్యాపిడ్) పోటీలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. తొలి టై బ్రేక్ 25+10 నిమిషాలతో రెండుగేమ్‌లు ఆడడం జరుగుతుంది. అది కూడా డ్రా అయిన పక్షంలో 10+10 నిమిషాలతో మరో రెండు టైబ్రేక్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రెండు గేమ్‌లు కూడా డ్రా అయిన పక్షంలో 5+3నిమిషాలతో బ్రిట్ట్జ్ పద్ధతిపై మరో రెండు గేమ్‌లను, చివరాఖరుగా 3+2నిమిషాలతో బ్రిట్ట్జ్ సడెన్ డెత్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.