అన్నపూర్ణమ్మను విమర్శించే స్థాయి, హక్కు ప్రశాంత్ రెడ్డికి లేదు 

– అన్నపూర్ణమ్మ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మల్లికార్జున్ రెడ్డి 
నవతెలంగాణ- కమ్మర్ పల్లి:
ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తికి అన్నపూర్ణమ్మను విమర్శించే స్థాయి, హక్కు లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన  తీవ్రంగా ఖండించారు. శనివారం  మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ రెడ్డి మాట్లాడారు. ఇటీవలే బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పదవి కోసం అన్నపూర్ణమ్మ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ప్రశాంత్ రెడ్డి మాట్లాడడం సరికాదని, పదవి కోసం అన్నపూర్ణమ్మ ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజలకు నిజాయితీ గల నాయకులు కావాలంటే వాళ్లే ఎన్నుకుంటారన్నారు. అన్నపూర్ణమ్మను ప్రశాంత్ రెడ్డి గౌరవిస్తే మేము కూడా ప్రశాంత్ రెడ్డిని గౌరవిస్తామన్నారు. అన్నపూర్ణమ్మ  బాల్కొండ బరిలో దిగుతున్నారని తెలియగానే ప్రశాంత్ రెడ్డికి దిమ్మతిరిగిపోయిందన్నారు. అన్నపూర్ణమ్మ ఎక్కడ గెలుస్తుందో తన పదవి ఎక్కడపోతుందో అని ప్రశాంత్ రెడ్డి భయాందోళనకు గురవుతున్నడన్నారు. ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని ఈ పదేళ్ళల్లో బ్రష్టుపట్టించాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు. బట్టాపూర్ అక్రమ క్వారీలో తన ప్రమేయం ఏమున్న ముక్కు నేలకు రాస్త అన్న ప్రశాంత్ రెడ్డి ఆ క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని కోర్టుకి వెళ్తే కోర్టు పరిశీలించి రెండురోజుల్లో ఆ అక్రమ క్వారీని మూసివేయాలని ఆదేశించిందన్నారు. ఆ క్వారీలో అక్రమాలు జరగకపోతే కోర్టు మూసివేయాలని ఎందుకు ఆదేశిస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా? అని ప్రశ్నించారు. గంజాయిని నియోజకవర్గంలో నిర్మూలించిందే తనని  ప్రశాంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడని, అంటే గంజాయి నియోజకవర్గంలో ఎక్కువ చలామణి అయ్యిందని ఒప్పుకున్నట్లే కదా అన్నారు. నియోజకవర్గంలో గంజాయిని విచ్చలవిడిగా సరఫరా చేసి యువత జీవితాలు నాశనం చేసింది ఎవరు అని అడిగితే ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డినే అని ఏ గ్రామంలో అడిగిన మహిళలు చెప్పుతారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి అన్నపూర్ణమ్మపై వ్యాఖ్యలు చేసేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్ట సంజీవ్, బీజేపీ సీనియర్ నాయకులు రెంజర్ల గంగారాం, చింత ప్రవీణ్, రెంజర్ల గంగాధర్, కొత్తపల్లి అరుణ్, కుంట భూమారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.