కమ్మనైన తెలంగాణ పదాల్ని తన పాటల్లో గుమ్మరించగల సినీకవి కాసర్లశ్యామ్. ఆయన పాటల్లో తెలంగాణ మాండలికాల సొబగు కనబడుతుంది.
అనురాగబంధాలే మన బలం, బలగమన్న సందేశంతో ఓ సంచలనాన్ని సృష్టించిన సినిమా ‘బలగం'(2023). ఆప్యాయతల్ని, ఆత్మీయతల్ని మరిచిపోయిన మనసులకు సున్నితంగా చురకలు పెట్టి, మనకు కంటతడిపెట్టించిన సినిమా. ఈ సినిమాలోని అన్ని పాటలు బాగున్నాయి. కల్మషం లేని ఊరి ప్రేమను, స్వచ్ఛంగా నవ్వే ఊరి తీరును వివరిస్తూ కాసర్లశ్యామ్ రాసిన ఈ పాటను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం..
ఊరంటేనే పల్లెటూరు. పచ్చని పంటలను, ప్రేమగల్ల మనసులను, గిత్తెల అడుగుల సవ్వడులను, ఆదమరచి నిద్రించే ఆలమందలను, ఏ స్వార్థం లేని రైతుల తీయని పలకరింపులను మన కళ్ళముందుంచుతుంది. పల్లె వాతావరణాన్ని, పల్లె మనుషులని మరిచిపోలేం. ఈ పాటలో పల్లె ప్రేమను అందమైన తెలంగాణ పదాల సోయగంతో వివరించాడు శ్యామ్.
చీకటిని విడిచి తెల్లవారుతున్న పల్లె సౌందర్యాన్ని గూర్చి మొదటగా చెబుతున్నాడు. కోడికూతలతో నిద్రలేచిన పల్లె కోడె లేగల గంతులతో ఒళ్ళు విరుచుకుందట. అంటే కోడికూతలు, లేగదూడల గంతులు పల్లెకి సుప్రభాతాన్ని పాడుతున్నాయని అర్థం. నా పల్లె ప్రజలు వేపపుల్లలతో పళ్ళు తోముకున్నారనడానికి బదులుగా నా పల్లె వేపపుల్లల చేదు నమిలిందని కొత్తగా చెబుతాడు. అంటే.. పల్లె ప్రజలు మేలుకున్నారంటే పల్లె మేలుకున్నట్టే కదా!
పళ్ళు తోముకోవడం తర్వాత స్నానం చేయడమే కదా! అందుకే నేలతల్లి తలకు వోసుకుందంటాడు. అంటే అలుకు చల్లడం అని అర్థం. అలికిన తరువాత అలంకరణే కదా! అందుకే ప్రతి ఇల్లు ముగ్గుసుక్కలతో అలంకరించుకుందని చెబుతున్నాడు. బావి గిరక నా పల్లె అంటూ బావి దగ్గర నీళ్ళు చేదుకున్న పల్లె వాసులు సద్దిమూటల్ని సర్దుకుని పొలంపనికి వెళ్ళిపోతున్న వైనాన్ని వివరిస్తాడు. ఆవులిచ్చే తెల్లని పాలధారవోలె పల్లె స్వచ్ఛంగా, అచ్చంగా తెలవారుతుందని, గుళ్ళోని గంటల మాదిరిగానే కోడె గిత్తల మెళ్ళో గంటలు మోగుతాయని అంటాడు.
రైతులంతా నాగలి భుజాన పెట్టుకుని నడుస్తారు. అది వారికి జీవనాధారం. ప్రాణాధారం. అదే రోజంతా దోస్తై వాళ్ళ వెంట తిరుగుతుంటది. అందుకే అది భుజంపై ఉంటే దోస్తు భుజంపై చెయ్యేసినట్టనిపిస్తుందట. గొడ్డుగోదాలే కుటుంబ సభ్యులనిపిస్తుందట. అవి పక్కన ఉంటే కొండంత బలగం పక్కన ఉన్నట్టనిపిస్తుందంటాడు. పంట పొలాల ముచ్చట్లని చల్లగాలి మోసుకొస్తుందని చెబుతాడు. చెట్లకొమ్మల నుంచి రాలుతున్న పూలచప్పట్లు, గడ్డిమోపులతో కాల్వగట్టుల మీద నుంచి నడిచివస్తున్న రైతుల నుంచి జారుతున్న చెమట చుక్కలతో తడిసిన మట్టిగంధాలు ఎంతో గొప్పనైనవి. ఊరు అమ్మ తీరు మనల్ని గుండెకి హత్తుకుంటుంది. కొంగులోన దాచిపెట్టి కొడుకుకి ఇచ్చే ప్రేమవేరు. ఈ పల్లెటూరు కన్నకూతురు తీరు కండ్లముందే సంతోషాల పంటపైరే ఎదుగుతుందని అంటున్నాడు.
ఊరు వంద గడపల మందగా, గోడ కట్టని గూడుగా కనబడుతుంది. చెరువుల్లో తుళ్ళే జెల్లచాపలా పరవశంగా చిందులేస్తుంది. అత్త, మామ, బావ, బాపు వంటి పలకరింపులతో, ప్రేమ పులకరింపులతో ఊరంతా చుట్టాలే. తోడబుట్టినవారే. దారంలో పూలదండలా ఒదిగి వుంటుంది పల్లె. రంగుల ఇంద్రధనస్సై మెరిసిపోతుంది పల్లె. ఆలుమగల ఆటలతో, అత్తాకోడళ్ళ కొట్లాటలతో, రచ్చబండమీద, టీ కొట్టు దగ్గర ముచ్చట్లతో సందడిగా ఉంటుంది. కూరతొక్కులతో తట్టబుట్టలు, సుట్టబుట్టల్లో బీడికట్టలు, కష్టం వస్తే ఒకరికోసం ఒకరంటూ సాయం చేసుకునే మనుషులు, మావిపూత కాసినట్టే స్వచ్ఛమైన మనసులు.. ఇవన్నీ పల్లె అందాలు.. ఊరంటే రోజూ ఉగాది అని, కడవూపిరిదాకా ఈ ఊరు గుర్తుంటుందని కాసర్లశ్యామ్ ఈ పాటలో వివరించాడు. పల్లెని విడిచి పట్టణాలకు వలస వెళ్ళిపోయే వారికందరికి ఈ పాట ఒక చెంపపెట్టులా ఉంటుంది. పట్టణాలలో బతికే వాళ్ళు ఈ పాట వింటే వాళ్ళ గుండెతో పాటు కళ్ళు కూడా తడియై పల్లెకి పరిగెత్తుకొచ్చేస్తారు. అమ్మ పిలుపులా తీయగా ఎదఎదకు వినిపిస్తుందీపాట..
పాట:-
కోలో నా పల్లె కోడికూతల్లే/ ఒల్లిరుసుకుందే కోడెలేగల్లే/ యాపపుల్లల చేదు నమిలిందే రామరామరామ/ తలకు పోసుకుందె నా నేలతల్లే/ అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే/ సద్దిమూటల్నే సగ బెట్టుకుందే/ బాయి గిరక నా పల్లే/ హే తెల్ల తెల్లాని పాలధారవోలే పల్లే తెల్లారుతుంటాదిరా/ గుళ్ళోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగ మోగుత ఉంటాయిరా/ నాగలి భుజాన పెట్టుకుంటే/ దోస్తులు చెయ్యేసినట్టేరా/ గొడ్డుగోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా/ సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెల్కల ముచ్చట్లు/ దారి పొడుగు సెట్ల కొమ్మల/ రాలుతున్న పూలచప్పట్లు/ గడ్డిమోపులు కాల్వగట్టులు/ సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టిగంధాల/ ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు/ కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమవేరు/ ఊరు పల్లెటూరు దీని తీరే కన్నకూతురు/ కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు/ వందగడపల మంద నా పల్లె/ గోడ కట్టని గూడు నా పల్లె/ సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే రామరామరామ/ మావ అత్త బావ బాపు వరసల్లే/ ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె/ దారంలో ఒదిగిన పూలదండల్లే రంగుల సింగిడి పల్లే/ ఆలుమొగలు ఆడే ఆటలు/ అత్త కోడండ్ల కొట్లాటలు/ సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు/ రచ్చబండ మీద ఆటలు/ చాయబండి కాడ మాటలు/ వొచ్చి పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి/ తట్ట బుట్టలల్ల కూర తొక్కులు/ సుట్ట బుట్టలల్ల బీడికట్టలు/ చేతనైన సాయం జేసే మనుషులు/ మావిపూత కాసినట్టే మనసులు/ ఊరంటే రోజు ఉగాది/ సచ్చేదాకా ఉంటది యాది..
– డా||తిరునగరి శరత్ చంద్ర,
sharathchandra.poet@yahoo.com