న్యూఢిల్లీ : నెలలు నిండకుండానే జన్మించే (ముందస్తు జననాలు) పసికూనల సంఖ్యను తగ్గించే విషయంలో మన దేశం గత దశాబ్ద కాలంలో ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. గర్భిణులు, శిశువుల మరణాలను నివారించే విషయంలో మాత్రం దేశం కొంత మెరుగుదల కనబరచింది. తల్లి గర్భంలో ఉన్న శిశువు 37 వారాల కంటే ముందే భూమి మీదకు వస్తే దానిని ముందస్తు జననంగా పరిగణిస్తారు. 2010-2020 మధ్యకాలంలో 119 దేశాలలో జరిగిన ముందస్తు జననాలను ది లాన్సెట్’ జర్నల్ విశ్లేషించి, దానికి సంబంధించి శుక్రవారం ఓ పత్రాన్ని ప్రచురించింది. ఈ పత్రం ప్రకారం 2020లో ప్రతి వెయ్యి జననాల్లో ముందస్తు జననాల రేటు 13.0గా ఉండగా 2019లో అది 13.1గా నమోదైంది. అంటే గత పది సంవత్సరాలలో ఎలాంటి పురోగతి కన్పించలేదు. సర్వే చేసిన 119 దేశాల్లో మన దేశంలోనే అత్యధికంగా అంటే 20% (3.02 మిలియన్లు) ముందస్తు జననాలు జరుగుతున్నాయి. జనాభా అధికంగా ఉండడం, శిశు జననాలు కూడా ఎక్కువగా జరుగుతుండడమే దీనికి కారణమని జర్నల్ తెలిపింది. సాధారణంగా నెలలు నిండకముందే జన్మించే శిశువులు నెల రోజుల వ్యవధిలోనే చనిపోయే అవకాశం ఉంది. అయితే భారత్ ఇలాంటి మరణాలను గణనీయంగా తగ్గించగలిగింది. నెలలు నిండకముందే జన్మించే ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 24.9% మంది మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తెలిపింది. అయినప్పటికీ ప్రపంచ దేశాలలో ఇది అత్యధికమే. ముందుగానే జన్మించే పిల్లల బరువు చాలా తక్కువగా ఉంటుందని, వారిని కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు ఆర్. సుందరరామన్ చెప్పారు. మన దేశంలోని 4,474 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో పిల్లల వైద్యులు ఒక్కరు కూడా లేరు. పారామెడికల్ సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ముందుగా జన్మించే పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులలో ప్రత్యేక కేర్ యూనిట్లు అవసరం కాగా అవి కూడా అరకొరగానే ఉన్నాయి. గర్భిణుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ముందస్తు జననాలను నివారించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.