కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు శుభపరిణామం
వైద్యవిద్యలో నాణ్యత అవసరం
నవతెలంగాణతో డాక్టర్ బుర్రి రంగారెడ్డి
నేడు డాక్టర్స్ డే. ఆరోగ్య సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే డాక్టర్లకు శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ పరిస్థితిపై ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యక్షులు, హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం ఆచార్యులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ ఆచార్యులు డాక్టర్ రంగారెడ్డి బుర్రితో నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ….
నవతెలంగాణ…. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది?
డాక్టర్ రంగారెడ్డి... ప్రజారోగ్య వ్యవస్థను కోవిడ్-19 ముందు, తర్వాతగా పరిశీలించాలి. కరోనా మహమ్మారిని చవిచూసిన తర్వాత ప్రజలు, పాలకులు, విధాన రూపకర్తలకు ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం చేయాల్సిన ప్రాధాన్యత అర్థమైంది. ఆ మేరకు మౌలిక సదుపాయాలు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం, జీనోమ్ సీక్వెన్స్, జీనోమ్ సర్వైలెన్స్ గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు అంతంత మాత్రంగా ఉండేవి. డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉండేది.
నవతెలంగాణ…రాబోయే కాలంలో మహమ్మారులు వస్తే ఎదుర్కొనేందుకు ఇవి సరిపోతాయా?
డాక్టర్‌రంగారెడ్డి.... ఇంకా సామర్థ్యం పెంచుకోవాలి. నిధులు ఎక్కువగా కేటాయించాలి. డాక్టర్లు, నర్సులతో సహా ఆరోగ్యసంరక్షణ సిబ్బందికి నైపుణ్య శిక్షణ తక్షణావసరం. కొత్త మెడికల్ కాలేజీల రాకతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన డాక్టర్ల సంఖ్యకు చేరువలో ఉన్నాం. అయితే వైద్యవిద్యలో నాణ్యత పెంచే చర్యలు చేపట్టాలి.
నవతెలంగాణ…. ఇటీవల నిర్వహించిన జీ-20 సమావేశంతో ఎలాంటి ఫలితాన్ని ఆశించవచ్చు?
డాక్టర్ రంగారెడ్డి… ఆ సమావేశంలో భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు రాకుండా నివారించడం, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడం, వ్యూహాత్మకంగా ఎలా స్పందించాలి? అనే అంశంపై మంచి చర్చ జరిగింది. అక్కడ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ దేశాలు అమలు చేస్తే మహమ్మారులను ఎదుర్కోగలుగుతాం.
నవతెలంగాణ …రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలేంటి? వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి?
డాక్టర్ రంగారెడ్డి … జీవనశైలి, ఆహారపు అలవాట్లతో వచ్చిన మార్పులతో ఇటీవల నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (అసాంక్రమిత వ్యాధులు) పెరిగాయి. చిన్న వయస్సు వారిలో గుండెపోటు, మధుమేహం రావడ చూస్తున్నాం. ఆహారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. వ్యాయమం చేసుకునేందుకు క్రీడామైదానాలను అభివృద్ధి చేయాలి.
నవతెలంగాణ : సీజనల్ వ్యాధులు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
డాక్టర్ రంగారెడ్డి : సీజనల్ వ్యాదులు రాకుండా వర్షకాలానికి ముందుగానే కార్యాచరణ చేపట్టి నిదులు కేటాయించి నివారణ చర్యలు తీసుకోవాలి. పారిశుధ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హత లేని వారు చిన్న, చిన్న రోగాలకు అవగాహన లేమితో విపరీతంగా యాంటీబయాటిక్స్ రాస్తున్నారు. రాబోయే కాలంలో ఇవి పన చేయకుండా నిర్వీర్యమయ్యే ప్రమాదముంది. పరిశుభ్రంగా ఉండడం అలవాటుగా మార్చుకోవాలి.