రచయిత సల్మాన్‌ రష్దీకి ప్రతిష్టాత్మక జర్మన్‌ పురస్కారం

బెర్లిన్‌: ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీ ప్రతిష్టాత్మక జర్మన్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్యంలో చేసిన విశేష కృషికి, నిరంతరం ప్రమాదాలు ఎదురవుతున్నా చెక్కుచెదరని ఆయన సంకల్పం, సానుకూల వైఖరికి గాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్‌ 22న ఫ్రాంక్‌ ఫర్ట్‌లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆయన రచనల్లో కథనాత్మక దృష్టితో పాటు నిరంతర సాహిత్య ఆవిష్కరణ, హాస్యం, మరియు జ్ఞానాన్ని మిళితం చేస్తారని జ్యూరీ తెలిపింది. హింసాత్మకతో కూడిన పాలనాశక్తులు మొత్తం సమాజాన్ని నాశనం చేసే విధానాన్ని వివరించడంతో పాటు వ్యక్తుల ప్రతిఘటనను నాశనం చేయలేరని కూడా వివరిస్తారని పేర్కొంది. గతేడాది ఆగస్టులో న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ సాహిత్య వేడుకలో ఆయన దాడికి గురైన సంగతి తెలిసిందే. ఆయన నిరంతరం శారీరక, మానసిక సమస్యలతో పోరాటం చేస్తున్నప్పటికీ .. ఇప్పటికీ రచనలను కొనసాగిస్తున్నారని జ్యూరీ ప్రశంసించింది.