నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

– మహిళా కాంగ్రెస్‌ నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ…మహిళా కాంగ్రెస్‌ నిరసన తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద మహిళలు కూరగాయలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు సునీతారావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు పెంచిన కూరగాయల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి వినియోగదారులకు సబ్సిడీతో సరఫరా చేయాలని కోరారు. పెరుగుతున్న నిత్వావసర ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. టమాట, పచ్చిమిర్చి, బీన్స్‌ ధరలు ఆకాశానంటుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు వెంటనే దిగొచ్చి పేదలకు ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.
గాంధీభవన్‌లో బోనాలు
మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనమెత్తారు. మహిళలు బోనమెత్తి ఉత్సాహంగా నృత్యం చేశారు. డప్పు వాయిద్యాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయూ ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.