ధరలను నియంత్రించాలి

– సామాన్యుల అవస్థలు
–  ధరల కట్టడిలో ప్రభుత్వాలు విఫలం : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు.. ధరల నియంత్రణలో వైఫల్యాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రదర్శనలు తీశారు. తక్షణం ధరల పెరుగుదలను నియంత్రించాలని నేతలు డిమాండ్‌ చేశారు. సామాన్యులు రెండు పూటలా తినలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నవతెలంగాణ- విలేకరులు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం నుంచి పెద్ద గడియారం వరకు ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్‌, పెట్రోలు ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైన ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, మూడెకరాల భూమి అందలేదన్నారు. సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో, మోత్కూరులో ప్రదర్శన నిర్వహించారు.
మహబూబ్‌నగర్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యాల యం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూనే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాజీవ్‌ చౌక్‌ వరకు ర్యాలీ చేపట్టారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట రూరల్‌, కల్వకుర్తి మండల కేంద్రాల్లో నిరసన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎంపీ మిడియం బాబూరావు, నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సం పన్నులకు కొమ్ముకాస్తూ పేదవారిపై అన్ని రకాలుగా భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలను హద్దూ అదుపు లేకుం డా పెంచుతున్నారన్నారు. పేదరికంలో మగ్గుతున్న ప్రజలపై పన్నుల భారం మరింత పెంచి దారిద్య్రం లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో ర్యాలీ చేపట్టారు. జూలూరు పాడులో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) వరంగల్‌ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని వరంగల్‌ రోడ్డు కూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. దేశంలో 60 శాతంగా ఉన్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువై తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. హనుమకొండ అంబేద్కర్‌ విగ్రహం నుంచి కాళోజి జంక్షన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మహబూబాబాద్‌, జనగామ జిల్లా కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకో చేశారు. మహబూబా బాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో గాంధీ సెంటర్లో రాస్తారోకో చేశారు. జనగామ జిల్లా కేంద్రం లోని నెహ్రూ పార్క్‌ వద్ద ధర్నా చేశారు. దీంతో సిద్దిపేట జనగామ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సీపీఐ(ఎం) నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. లింగాలఘనపురం మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. పాలకుర్తి మండల కేంద్రం బస్టాండ్‌ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు.